రోజూ నాకు కనిపిస్తుంటాడు
అతడు విరామచిహ్నం లేని
సుదీర్ఘ వాక్యంలా ఉంటాడు.
అతడు
వాళ్ళ పూర్వికులెప్పుడో పోగొట్టుకున్న దానిని
ఇప్పుడు వెతుక్కుంటున్నట్లుంటాడు
ఎవరో మూడు పాదాలు రాసి
వదిలేసిన పద్యంలా ఉంటాడు
ఆలింగనానికి ఆహ్వానిస్తూనే
స్వీయ క్వారంటైన్ పాటిస్తాడు.
సజల స్రవంతిని అనుకుంటూ
ఎండిపోయిన కాలువలా ఉంటాడు
పుస్తకంలో కాగితాల మధ్య
నెమలీక అనుకుంటూ
పుస్తకంలోంచి రాలిపోయి
గాలికి కొట్టుకుపోతున్న
పాత కాగితంలా ఉంటాడు.
అతడు
ఇంకా నాకు రోజూ ఎదురౌతూనే ఉంటాడు!
- రాచపాళెం










