
తెలుగునాట ప్రగతిశీల చరిత్రకారుల్లో ప్రసిద్ధులైన ఆచార్య వకుళాభరణం రామకృష్ణ తన సంక్షిప్త ఆత్మకథకు 'నన్ను నడిపించిన చరిత్ర' అని పేరు పెట్టుకున్నారు. తను నడచిన చరిత్ర అనీ, చరిత్రతోనే తన నడక ముడిపడివుందని ఆయన భావన. వాస్తవానికి నడిపించినది లలిత అన్న కృతజ్ఞత ఈ పుస్తకం పొడుగునా కనిపిస్తుంది. ఆయన రాసిన రాయించిన అనేక చరిత్ర పరిశోధన పుస్తకాలే గాక ఈ ఆత్మకథా శకలాలు కూడా ఆమె ఆకాంక్ష మేరకే రాశానన్నారు. మిత్రులూ, శ్రేయోభిలాషులూ, పరిచయస్తులనే తనకున్న వెల కట్టలేని సంపదగా అభివర్ణించిన రచయిత - ప్రతి ఘట్టంలో వారిని పునర్దర్శనం చేయించారు. చరిత్ర రచనలో ఆరితేరినవారు గనక వాటిని వ్యక్తిగత అనుబంధాలుగానే గాక చరిత్రగతితోనూ, సామాజిక పరిణామాలతోనూ కలగలిపి చెప్పగలిగారు. పెద్దగా వనరులు లేని ఒక సంప్రదాయ కుటుంబ యువకుడు ఆశయబలంతో ఉన్నత విద్యాశిఖరాలు అధిరోహించడం, అందుకు సహకరించిన జీవిత భాగస్వామిని లలిత ప్రేమాస్పద శ్రమాస్పద పాత్రనూ ఇందులో చూస్తాం. మేధావులను నిరుత్పాదక పాత్రధారులుగానూ, కుహనా జీవులుగానూ చెప్పే అసహన వాతావరణం నిండిన ఈ రోజుల్లో ఇరవయ్యో శతాబ్దిని ముందుకు నడిపేందుకు దోహదపడిన ప్రగతిశీల బుద్ధిజీవుల విలక్షణ పాత్రకు ఈ పుస్తకంలో విషయాలు అద్దం పడతాయి. ఎన్ని ఉన్నత స్థానాలు అధిరోహించినా తమకు తొలి ప్రేరణ అయిన అరుణ పతాకాన్ని, ఆ ఉద్యమాల స్ఫూర్తిని మరచిపోకపోవడం ఈ పుస్తకంలో మనం చూసే మరో విశేషం.
ప్రకాశం జిల్లా దర్శి తాలూకా రామభద్రాపురం కుగ్రామంలో 1938లో వకుళాభరణం రామకృష్ణ పుట్టారు. తాత, తండ్రి అర్చకులు. సంపాదన జీవికకు సరిపోక తండ్రి అప్పటి నెల్లూరు జిల్లాలోని పాకాల గ్రామానికి తరలివెళ్లారు. ఊళ్లో వున్న ఒక మాష్టారు దగ్గర చదువుకుంటుంటే అనుకోని ఘటనలతో కక్ష గట్టిన ఆయన చదువుకునే అవకాశం లేకుండా చేశాడు. దగ్గర్లోని కందుకూరుకు మారి అన్నయ్యతో పాటు తనూ చదువుకున్నారు. నాటి గ్రామీణ వాతావరణం, వృత్తి వ్యవసాయాలు సామాజిక జీవనం నుంచి జానపద కళల వరకూ చెప్పడం ఆయన పరిశీలనను, ఆసక్తిని తెల్పుతుంది. నాటి ఆటపాటలనూ అంతే ముచ్చటగా రాశారు. పెద్దవారయ్యాక విదేశాలకు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకూ వెళ్లినప్పుడు కూడా ప్రత్యేకతలు అక్షరీకరిస్తూనే వచ్చారు. ఆచార వ్యవహారాల నుంచి కులమతాల సంబంధాలు అందరినీ గౌరవించాలనే నాన్నగారి నిర్దేశం కూడా గుర్తుచేసుకున్నారు. నెెల్లూరులో రెండేళ్లపాటు చదువుకున్న 1948-50 కాలంలో సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలెట్టారు. అది కమ్యూనిస్టు పార్టీపై నిషేధం నడుస్తున్న కాలం. అన్నయ్య నరసింహాచార్యులు కూడా రహస్య యంత్రాంగంతో సంబంధంలో వున్నట్టు కనిపిస్తుంది. స్వాతంత్య్ర పోరాటం, సాహిత్య వికాసం వంటివాటికి పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో నాటకాలకు, సినిమాలకు ఆదరణ ఎక్కువ. ఈ ప్రభావం కూడా పడింది. సింగరాయకొండలో ఆయన ప్రజానాట్య మండలి కళారూపాలు చూడగలిగారు. ఉపాధ్యాయ నేతలైన సింగరాజు రామకృష్ణయ్య, చెన్నుపాటి లక్ష్మయ్య అక్కడే ఆయనకు కలిశారు. కమ్యూనిస్టు పార్టీకి అగ్నిపరీక్షా కాలమైన ఆ దశలో చారిత్రికాంశాలు, సైద్ధాంతిక పరిణామాలు కూడా గుర్తు చేశారు. కమ్యూనిస్టు అభిమాని అయిన వారి నాన్న మూడో కుమారుడిని జోషీ అని పిలుచుకున్నారు.
తదుపరి దశలో ఆయన చైతన్యశీలమైన కావలి కాలేజీలో చేరడం జీవితంలో కీలక ఘట్టం. ఆచరణ, చైతన్యం, కొత్త శక్తి సంతరించుకున్నాయి. విశ్వోదయ తర్వాత జవహర్ భారతిగా పేరు గాంచిన ఆ సంస్థ వ్యవస్థాపకుడైన డిఆర్ (డొడ్ల రామచంద్రారెడ్డి) కవి భుజంగరాయ శర్మ, కెవి రమణారెడ్డి వంటివారితో ఆయన మమేకమైంది అక్కడే. కళాభిరుచి మరింత ప్రగాఢమైంది. ఆ క్రమంలో ఆయన ప్రస్తావించే పేర్లు, కళారూపాలు వింటే అభిరుచి వున్నవారెవరైనా తలలూపకుండా వుండలేరు. వీలైనంత ఎక్కువమంది వ్యక్తులు, వారి పాత్ర పేర్కొనడం ఆయనలోని చరిత్రకారుణ్ని చూపిస్తుంది. 1952లో కమ్యూనిస్టుల ఘన విజయాలూ, 1955 మధ్యంతర ఎన్నికలు కమ్యూనిస్టు ప్రభుత్వ అవతరణపై ఆశలూ ఆశాభంగం.. ఆ పైన ఆంధ్ర యూనివర్సిటీలో రెండేళ్ల చదువు, విద్యార్థి ఫెడరేషన్ తరపున యూనియన్ ఎన్నికల్లో గెలుపు. సంరంభంగా సాగిన కార్యక్రమాలు, వచ్చిన అభ్యుదయవాదుల విశేషాలు ప్రతిదీ ఒక సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లా సాగిపోతాయి. తర్వాత కావలి కాలేజీలోనే లెక్చరర్‌గా చేరడం ఒక ప్రత్యేకత. అప్పట్లో తన అధ్యాపకుడుగా వుండిన కెవి రమణారెడ్డి ఇప్పుడు బాగా సన్నిహితమయ్యారు. పెద్దగా తోడు నిలిచారు. ఈ పుస్తకంలో లలిత తర్వాత ఎక్కువగా కనిపించే పేరు ఆయనదే. ఆమె మొదటి కూతురు విద్యను మోస్తున్నపుడు విద్యా సంబంధమైన ఆహ్వానంపై వకుళాభరణం అమెరికా వెళ్లారు. అక్కడా ఇదేవిధమైన పరిశీలన. సిపిఎంలో నగ్జలైట్ చీలిక వచ్చినపుడు కెవిఆర్ అటువైపు మొగ్గగా వకుళాభరణం రామకృష్ణ తటస్థంగా ఉండిపోయారు. అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో చేరడం కన్నా తమ రంగంలో పనిచేస్తూ సహకరించడమే మంచిదన్న సుందరయ్య గారి సలహాతో బోధనా రంగంలోనే కొనసాగారు. ఆ సందర్భంగా ఒక జాతీయ సెమినార్‌లో గొప్ప చరిత్ర పరిశోధకురాలైన రొమిలా థాపర్ ఆయనను బిపిన్ చంద్రకు పరిచయం చేస్తే, ఆయన జవహర్ లాల్ నెహ్రూ యూని వర్సిటీలో చేరాలని సూచించారు. తగు సలహాలూ ఇచ్చారు. ముగ్గురు పిల్లల తండ్రిగా బోలెడు బాధ్యతలు మోస్తున్న వకుళాభరణం భార్య ప్రోత్సాహంతో 1972లో ఢిల్లీ బయల్దేరారు.
జెఎన్‌యు కాలాన్ని గురించి వకుళాభరణం రాసిన అంశాలు మరింత ప్రత్యేకమైనవి. కేంద్రంలోని బిజెపి పాలకులు అదో దేశద్రోహ శిబిరంలా చిత్రించడానికి కారణమేమిటో కూడా అర్థమవుతుంది. బిపిన్‌చంద్ర, ఫణిక్కర్, సతీశ్‌చంద్ర, హర్బన్స్ ముఖియా, థాపర్, ఇంకా ఎందరో ఉద్ధండులు... భారతదేశ చరిత్ర అధ్యయానికి బాటలు వేసిన వారు. అవన్నీ గొప్పగావున్నా తిండితిప్పలు విషయంలో ఇబ్బందులు, థాపర్ సాయంతో ఒక తమిళ పరిశోధకుడికి తెలుగు చెప్పి రూ.200 తెచ్చుకోవడం. అక్కడ అధ్యయనం వినూత్న బోధనా పద్ధతులు, వామఫక్ష వాతావరణం ఆయనను అమితంగా ఆకర్షించాయి. అక్కడ కందుకూరి వీరేశలింగం అండ్ హిజ్ టైమ్స్ ఎంఫిల్ థీసిస్ రాసి ఆ తర్వాత ఆపేద్దామనుకుంటే పెద్దల ఒత్తిడితో సర్వేపల్లి గోపాల్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌లో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అన్న పిహెచ్‌డి పరిశోధన. ఇవి రెండూ కూడా తెలుగు వారి ప్రామాణిక గ్రంథాలుగా నిలిచిపోయాయి. ఈ సమయంలో పిల్లలను ఉద్యోగాన్ని చూసుకుంటూనే లలిత గారు కూడా లవణం హేమలత దంపతుల ప్రోత్సాహం సహాయంతో నేరస్త జాతులపై పరిశోధన పూర్తి చేశారు. విశేషమేమంటే కావలి జవహర్ భారతిలో లాగే జెఎన్‌యులో కూడా ఒక ఏడాది ఆయన బోధనా బాధ్యతలు నిర్వహించాల్సి రావడం. రెండేళ్ల తర్వాత ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా, తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ కాలంలో రాజకీయ పరిణామాలు తెలుగుదేశం అధికారంలోకి రావడం, కేంద్రంలో పరిణామాలు పొందుపర్చారు. ఈకాలంలో పాలనాపరంగానూ, విద్యారంగంలోనూ అనేక కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తన పరిశోధక విద్యార్థులతోనూ వామపక్ష సాంస్క ృతిక ఉద్యమాలపై అధ్యయనం చేయించడానికి దోహదపడ్డారు. పదవీ విరమణానంతరం కొత్తగా స్థాపించిన నల్సార్ న్యాయ విద్యాలయాన్ని తీర్చిదిద్దడంలో భాగం పంచుకున్నారు. పూసల్లో దారంలా ఈ కాలమంతటా వచ్చిన రాజకీయ పరిణామాలు కూడా తన అభిప్రాయాలతో సహా రేఖామాత్రంగా చెప్పేశారు. మరో వైపున లలిత కలకత్తా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పూర్తి చేశారు. ఆమెకు తెలుగు అకాడమీలో ప్రత్యేక అవకాశం రావడంతో చాలాకాలం తర్వాత వారిద్దరూ ఒకేచోట వుండగలిగారు. నేరస్త జాతులు, దేవదాసి, మాతంగి, జోగిని వ్యవస్థ వంటి వాటిపై సాధికారిక గ్రంథాలు అందించారు. ఇంకా అనేక జీవిత చరిత్రలతో సహా నిరంతర వ్యాసంగం సాగిస్తూ వచ్చారు. 2010 నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ 2017లో కన్నుమూయడం వకుళాభరణంకు తీరని వెలితిగా మిగిలింది. వకుళాభరణం పెద్ద కుమారుడు రాజగోపాల్.. వెల్చేరు నారాయణరావు పర్యవేక్షణలో స్వీయ చరిత్రలు వలస కాలపు ఆంధ్ర సమాజంపై పరిశోధన చేసి ప్రస్తుతం నాన్న పనిచేసిన హెచ్‌సియులోనే అధ్యాపకులుగా ఉన్నారు. రెండో కుమార్తె విద్య భాషాశాస్త్రం అభ్యసించారు. చిన్న కుమారుడు వంశీచరణ్ అర్థశాస్త్రంలో పిహెచ్‌డి. వీరూ ఉద్యమాలతో సంబంధం వున్నవారే.
ప్రకాశం జిల్లాలో ఎక్కడో మారుమూల పేద అర్చక కుటుంబంలో పుట్టిన వకుళాభరణం కుటుంబమంతా ఇంతటి అధ్యయన ప్రస్థానం సాగించడం, అందుకు లలిత గారు చూపిన దీక్షాదక్షతలు ఉత్తేజమిస్తాయి. ఇన్ని పరిస్థితుల మధ్యనా వారు ప్రగతిశీల లౌకిక వరవడిని చెక్కు చెదరనివ్వ కుండా చూడటం, రంజాన్ నాడు పుట్టిన మనవడికి ఇర్ఫాన్ అని పేరు పెట్టుకోవడం ఆకట్టుకుంటుంది. నాటి విద్యార్థులైన బివి రాఘవులు, మాజీ ఎంపి మాల్యాద్రి, శారద వంటి వారిని గుర్తు చేసుకోవడం, పరిశోధక శిష్యులు, సన్నిహితుల గరించి ఆర్ద్రంగా రాయడం వకుళాభరణంలో మానవీయ పార్శ్యాన్ని చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్‌లో ఆయన పాత్ర సుపరిచితమే! 1998లో పదవీ విరమణ తర్వాత రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటు వరకూ - మిత్రులు పరిశోధకుల సంస్థల ప్రోత్సాహం తో తెలుగు వారి సమగ్ర చరిత్ర ఎనిమిది సంపుటాలుగా ప్రచురించడం వకుళాభరణం కృషికి తారాస్థాయి.
ప్రగతిశీల మేధావుల ఆత్మకథలు తెలుగులో తక్కువే. వకుళాభరణం రామకృష్ణ అనుభవంతో అధ్యయనంతో జీవిత పోరాటంతో పండిన దశలో రాసిన ఈ జ్ఞాపకాలు, ఆయన భాష శైలి అన్నిటినీ మించి ఆయా దశల్లోని తన ఆలోచనలను ఘర్షణలను యథాతథంగా గుదిగుచ్చి నెమరేసుకోవడం చదువరులకూ అనుభూతినిస్తుంది. అనుకున్నవి సాధించడానికి, దాంపత్య జీవితంలో పరస్పరం సహకరించుకోవడానికి, సామాజిక నిబద్ధత నిలుపుకోవడానికి కూడా వకుళాభరణం రామకృష్ణ లలిత దంపతుల గాథ పఠనీయమవుతుంది.
- తెలకపల్లి రవి