Dec 19,2022 06:40

కొత్త శతాబ్దంలో రెక్క విప్పుకున్న నలభై మంది యువ రచయితల నలభై 'ఉత్తమ' కథల్ని యెంపిక చేసి వాటిని చదివి అభిప్రాయం చెప్పమని మిత్రుడు వేంపల్లి షరీఫ్‌ అడిగినప్పుడు- వాళ్లలో యెంతమంది కొత్తగా చెబుతున్నారు, యెంత మంది వర్తమానంలో నిలబడి భవిష్యత్తులోకి ఎక్కువ దూరం చూడగలుగుతున్నారు', వారి దృక్పథం యేంటి? యీ విషయాల మీదే యెక్కువ దృష్టి పెట్టాను. కొత్త శతాబ్దంలో సమాజం యెదుర్కొంటున్న సవాళ్లు యేమిటి, అవి సాహిత్యంలో యే మేరకు ప్రతిఫలిస్తున్నాయి, రచయితలు భిన్న సమూహాల జీవితాల్ని కేవలం యథాతథంగా చిత్రించడం దగ్గరే ఆగిపోతున్నారా, గుణాత్మకమైన మార్పుకు దోహదం చేసే చలనాన్ని తమ రచనల్లో విశ్లేషణాత్మకంగా. విమర్శనాత్మకంగా చూసి కళాత్మకంగా వున్నతీకరించగలుగుతున్నారా? వంటి అంశాల పైకే నా మనసు పోయింది.
సమాజంలాగానే సాహిత్యం కూడా నిత్యం చలనశీ లంగా ఉండాలి. సాహిత్యకారుడు తాను జీవించే పరిసరా ల్లో జరిగే మార్పుల్ని నిశితంగా పరిశీలించాలి. వాటికి కార్యకారణ సంబంధాన్ని మూలాల్లోకి వెళ్లి విశ్లేషించు కోవాలి. అభివృద్ధి నిరోధకమైనదాన్ని తిరస్కరించాలి. జీవితాన్ని మెరుగుపరచుకోడానికి దోహదం చేసే దారుల్ని ఆవిష్కరించుకోవాలి - అని బలంగా విశ్వసించే తరం నాది. సాహిత్య రచన సామాజిక ఆచరణ అని నమ్మే నా మాటలు కొత్త తరం రచయితల్లో కొందరికి రుచించకపోవచ్చు. సాహిత్య ప్రయోజనం - సామాజిక బాధ్యత - ప్రాపంచిక దృక్పథం వంటి మాటలు వారి చెవికి యింపుగా వినిపించకపోవచ్చు. అవి కాలం చెల్లిన ఆలోచనలుగా కూడా తోచవచ్చు. మరి కొందరు వొక దృక్పథం కలిగి వుండటమే సాహిత్య నేరంగా భావిస్తూ వుండొచ్చు. అనిబద్ధత దృక్పథ రాహిత్యం వుత్తమ సాహిత్య గుణాలుగా ప్రచారం చేసేవారు తక్కువేం కాదు. దృక్పథం సృజనాత్మకతకు ఆటంకంగా పరిణమిస్తుందని వాదించే వారు కూడా వున్నారు. నిజానికి దృక్పథం జీవితాన్ని అర్థం చేసుకుని రచనలో స్పష్టతని సాధించడానికి దోహదం చేసే అంశమే గాని అడ్డు కాదు.
దృక్పథ బలంతో, వస్తు రూప వైవిధ్యంతో రాస్తోన్న 'యువ' రచయితల చేతిలో తెలుగు కథ కొత్త పుంతలు తొక్కింది అని యీ సంకలనంలో కనీసం వొక డజను కథలన్నా రుజువు చేస్తాయి. ఆ విధంగా తెలుగు కథకి మంచి భవిష్యత్తు వుందని 'యువ' హామీ యిస్తుంది. మచ్చుకు వాటిలో కొన్ని మెతుకులు పట్టి చూద్దాం:
ఆధునిక భావజాలాలకి అనుగుణంగా పౌరాణిక పాత్రలతో పున:కథనాలు మనకు కొత్త కాదు గానీ బేతాళ పంచవింశతి కథలోని వొక పాత్ర తిరగబడితే, అది స్త్రీ పాత్ర అయితే, అన్న వూహతో చైతన్య పింగళి సంధించిన 'మనసిజ విల్లు' ... స్త్రీ పురుష శృంగార అనుభవవంలో మనశ్శరీరాలు నిర్వహించే పాత్రపై నిశ్చిత నిశ్చయాలని ఛేదిస్తుంది. స్త్రీ మానసిక శారీరక అవసరాల్ని తమదైన కోణం నుంచి నిర్వచించి నిర్ధారించి శాసించే పురుషస్వామ్యంపై చెంపపెట్టు యీ కథ. సున్నితమైన హాస్యాన్ని సునిశితమైన వ్యంగ్యాన్నీ మేళవించి స్త్రీ లైంగికత చుట్టూ అల్లిన మిత్‌ని బద్దలుకొట్టడమే ప్రధాన కథాంశంగా స్వీకరించి దాన్ని నిర్వహించిన తీరు మెదడుకు గిలిగింతలు పెడుతూనే ఆలోచింపజేస్తుంది. వర్చ్యువల్‌ రియాలిటీ వికృత రూపాన్ని వినూత్న కథనంతో ఆవిష్కరించిన మరో కథ పూర్ణిమ తమ్మిరెడ్డి 'ఎడిట్‌ వార్స్‌'. యీ కథ రూపంలోనూ, సారంలోనూ అన్ని విధాలా అత్యాధునికమైనది. ది కార్వాన్‌ అన్న పత్రికలో ది ఎడిట్‌ వార్స్‌ పేరుతో వచ్చిన వాస్తవిక కథనాన్ని ఆధారం చేసుకుని... పూర్ణిమ సాంకేతిక రంగంలో తన అనుభవానికి సృజనాత్మకతని జోడించి యెంతో సంయమనంతో ప్రతీకాత్మకంగా కథ నిర్వహిం చింది. ప్రయోగం, దృక్పథం రెండూ యెటువంటి పొరపొచ్చాలు లేకుండా జంటగా సహజీవనం చేయగలవని చెప్పడానికి యీ కథ మంచి ఉదాహరణ.
స్త్రీ పురుష సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని కొత్త రచయితలు యెలా చూస్తున్నారు - ప్రేమలు కలయికలు విడిపోడాలు ప్రీ, ఎక్స్ట్రా మ్యారిటల్‌ రిలేషన్స్‌, సహజీవనం, పెళ్లి, మల్టిపుల్‌ రిలేషన్స్‌ ... వీటి పట్ల స్థిరీకృతమైన విధి నిషేధాల విషయమై తమ కథల్లో యెలా స్పందిస్తున్నారు - యే విలువల్ని ప్రతిపాదిస్తున్నారు - యే ధోరణుల్ని వున్నతీకరిస్తున్నారు? ఇటీవల సాహిత్య చర్చల్లో ప్రధానంగా ముందుకు వస్తున్న ప్రశ్నలివి. (ఇన్‌ ద మూడ్‌ ఫర్‌ లవ్‌, నువ్వెళ్ళిపోయాకా, తొలిప్రేమ కథలు మొ. సంకలనాలు యీ చర్చని మరోసారి ముందుకు తెచ్చాయి). కాడ మల్లి (మెహర్‌), శీలానగర్‌ రెండో మలుపు (మిధున ప్రభ), మధురానగర్‌ మెట్రో స్టేషన్‌ (మొహమ్మద్‌ గౌస్‌), సీత కనబడింది (నాగేంద్ర కాశి), తన్మయి (ఉషాజ్యోతి బంధం), ఇంత సౌఖ్యమని ... (రవి మంత్రిప్రగడ), చెరువు - చింత చెట్టు (స్వాతికుమారి బండ్లమూడి), ఊర్మిలక్కతో సెక్స్‌ (చిన్ని అజరు) .. యిలా యీ వస్తువుకి 'యువ' కథా సంకలనం లో కూడా సింహభాగమే లభించింది. వీటిలో మెహర్‌ 'కాడ మల్లి' గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. స్త్రీ పురుషుల మధ్య కలయిక బ్రేకప్‌ యెడబాటు యెంత హుందాగా గౌరవప్రదంగా ప్రజాస్వామికంగా వుండాలో తెలియజెప్పే యీ కథ నిర్మాణపరంగా సాంద్రంగా వుండటమే కాదు, గంభీరంగా కూడా వుంటుంది. కథలో మౌనం మాట్లాడుతుంది. దేహభాష పాత్రల అంతరంగా ల్లోకి తొంగి చూసేలా చేస్తుంది. కథని ఆద్యంతం పరిమళభరితమైన ఓపెన్‌ స్టోరీగా నడపడం యెలాగో 'కాడ మల్లి'ని చూసి నేర్చుకోవచ్చు.
మాంత్రిక వాస్తవికత సామాజిక వాస్తవికత కలగల్సిన తన పూర్వికుల కథ చెప్పి సరికొత్త కథకి పురుడు పోసిన యువ కథకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌. 'పురుడు' పరిణామంలో చిన్నదైనా వస్తుపరంగా రూపపరంగా శతాబ్దాల చరిత్ర సంస్క ృతుల్ని పరిచయం చేసింది. జానపద మౌఖిక కథా శిల్పాన్ని సమకాలీన కథకి అన్వయించడం ద్వారా గొప్ప శిల్పాన్ని సాధించాడు రమేష్‌. మైనారిటీ అస్తిత్వ నేపథ్యం నుంచి వెలువడ్డ మానస ఎండ్లూరి 'ఒకరోజు', హుమాయూన్‌ సంఘీర్‌ 'హరామ్‌' కథలు యీ సంకలనానికి నిండుదనం తెచ్చాయి. మొదటిది దళిత క్రిష్టియన్‌ సంస్క ృతిని మృదువైన హాస్యంతో విమర్శనాత్మకంగా పరిశీలిస్తే, రెండవది ముస్లిం మతంలోని విశ్వాసాల్ని మానవీయత గీటురాయి మీద హేతుదృష్టితో పరీక్షించింది. మత సామరస్యాన్ని బోధించే కథలు కొన్ని (షేక్‌ షబ్బీర్‌ హుస్సేన్‌: మా వూరి శివుడు, మేడి చైతన్య: సాయిబోల్ల పిల్ల) యీ సంకలనంలో చోటుచేసుకున్నాయి. అసహనం విద్వేషం పునాదిగా రాజకీయాలు నడుస్తున్న కాలంలో వాటి అవసరాన్ని సంపాదకుడు సరిగానే గుర్తించాడు.
40 యేళ్ల లోపు వాళ్లు అంటే మరీ అంత యువతేం కాదు. కొందరు సీజన్డ్‌ రైటర్స్‌గా స్థిరపడ్డారు కూడా. కాబట్టి వాళ్లని ఇప్పుడే కలంబట్టిన రచయితలుగా గుర్తించలేం. వాళ్ల చేతుల్లో కథ యెన్ని కొత్త పోకడలు పోయిందో గ్రహించడానికి పైన పేర్కొన్నవి కొన్ని తార్కాణాలు మాత్రమే. లోతుగా అధ్యయనం చేస్తే మరిన్ని దగంశాలు గోచరించవచ్చు.
ఈ సంకలనంలో చోటు చేసుకున్న కథలన్నీ వుత్తమమైనవేనా అంటే కాపోవచ్చు. కొన్ని కథలు కాబోయి కాలేకపోయినవీ, కొన్ని కథల చట్రంలోకి యిమడనివీ వుండొచ్చు. అయితే మూస బద్దలు కొట్టి కొత్తగా రాయాలనే తపన మాత్రం చాలామందిలో కనపడుతోంది. రూప ప్రయోగం చేయాలనే ఆలోచన కొందరిలోనైనా కనిపిస్తుంది. నిద్ర చావు అభావం వంటి మార్మిక జీవిత రహస్యాల్ని వ్యాఖ్యాన రహితంగా విలోమ అసిత్వ కథనంలో నిర్వచించిన ధీరజ్‌ కాశ్యప్‌ - డెఫినిషన్స్‌, ఆధునిక సాంకేతికతని సైన్స్‌ ఫిక్షన్‌లో మేళవించి మానవీయ విలువల్ని ప్రతిపాదించిన కుప్పిలి సుదర్శన్‌ - హెల్పింగ్‌ డోమ్‌, హిపోక్రసీ వంటి అమూర్త భావనని పాత్రగా రూపు కట్టించి మనిషిలోని స్వారా ్థన్ని అక్షరాల్లోకి తర్జుమా చేసిన పాణిని జన్నాభట్ల - ఎయిత్‌ సిన్‌, ఆర్థికావసరాలకూ లైంగిక నైతికతకీ మధ్య యేర్పడే ఇన్‌ డీసెంట్‌ ఘర్షణని కొన్ని ఘటనల ద్వారా పాత్రల మనోగతం ద్వారా యాంటీ క్లైమాక్స్‌ ద్వారా బహిర్గతం చేసిన రిషి శ్రీనివాస్‌ - నిషిద్ధాక్షరాలు, ఆకస్మికతని దైనిక జీవితంలో యాంత్రికంగా మలచుకునే నగర ప్రేమని గ్లూమీగా చిత్రించి న మహమ్మద్‌ గౌస్‌ - మధురా నగర్‌ మెట్రో స్టేషన్‌, సంప్ర దాయ కథా నిర్వచనాల్ని తిరస్కరించి ప్రీ మ్యారిటల్‌ రిలేషన్‌లోని బలమైన వుద్వే గాన్ని మ్యూజింగ్స్‌ రూపంలోకి మలచిన ఉషా జ్యోతి బంధం - తన్మయి కథల్లో చేసిన ప్రయోగాలు గమ నార్హం. ... అయితే యెటువంటి ప్రయోజ నం లేకుండా కేవలం ప్రయోగం కోసమే ప్రయోగం చేయడం పట్ల రచయితలు అప్రమత్తంగా ఉండాలి. అవసరం మేరకు చేసే ప్రయోగం కథకి కొత్త ప్రాణం పోస్తుంది. ప్రయోగం సారాన్ని మింగేయకూడదు. ప్రయోగమే కథ కాకూడదు.
కథానుగుణమైన భాష వాడటంలో కొత్త రచయితలు అప్రమత్తంగా వున్నారు. తమ ప్రాంతీయ సామాజిక మాండలికాలని స్వేచ్ఛగా వుపయోగించుకుంటూ గడ్డం మోహన్‌ రావు, నస్రీన్‌ ఖాన్‌, ఉప్పులేటి సదయ్య, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌, కందివనం స్ఫూర్తి, హుమాయూన్‌ సంఘీర్‌ (తెలంగాణా), ఇండ్ల చంద్రశేఖర్‌ (ఒంగోలు), మిథున ప్రభ (విశాఖ), సురేంద్ర శీలం (కర్నూలు) కె వి మేఘనాథ రెడ్డి (చిత్తూరు) వంటి రచయితలు వాడిన కథన భాష వారి కథలకి గొప్ప స్థానీయతనీ విశ్వసనీయతనీ సాధించింది. కథలో భాష పట్ల యువ కథకుల ప్రజాస్వామిక దృక్పథం చాలా హృదయస్పర్శిగా అనిపిస్తుంది. ఏది యేమైనా యివి యివాళ్టి కథలు. వర్తమాన కథా చరిత్రకి సాక్ష్యాలు. భవిష్యత్‌ కథ యీ రచయితల చేతుల్లో వుంది. ఈ కథల మంచి చెడ్డల నిర్ణయం విజ్ఞులైన పాఠకులదే.
(40లో 40 కథల సంపుటి ముందుమాటలో కొన్ని భాగాలు)

- ఎ.కె. ప్రభాకర్‌