జోహెన్స్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జోహెన్స్‌బర్గ్‌లోని బహుళ అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా 52 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 43 మంది గాయపడినట్లు అత్యవసర సేవల ప్రతినిధి రాబర్ట్ ములౌద్జీ వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని, అయితే భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకునే అవకాశం ఉందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ భవనంలో ఎంతమంది నివసిస్తున్నారనే అంశంపై కూడా స్పష్టత లేదని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.