Nov 17,2023 13:31

కేప్‌ టౌన్‌ :   గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) విచారణ చేపట్టాలని దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది. ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులను తాము చూస్తున్నామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా గురువారం మీడియాకి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడులపై విచారణ చేపట్టాలని కోరుతున్న ఇతర దేశాలు, సంస్థలతో కలిసి సంయుక్తంగా ఐసిసిని విచారణ చేపట్టాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని స్పష్టం చేశారు. గాజాలోని అతిపెద్దదైన అల్‌-షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్‌ దళాలు దిగ్బంధించడంతో పాటు ఆహారం, నీరు, విద్యుత్‌ వంటి సదుపాయాను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
అక్టోబర్‌ 7 నుండి ఇజ్రాయిల్‌ చేపట్టిన దాడుల్లో గాజా, వెస్ట్‌బ్యాంకులలో సుమారు 11,517 మంది పాలస్తీనియన్లు మరణించగా, 32,000 మంది గాయాలపాలయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఎంతో మంది అమాయకమైన చిన్నారులను బలిగొన్న యుద్ధాలను చరిత్రలో చూడలేదని అన్నారు. గాజాలో నిర్బంధ శిబిరంపై మారణహోమాన్ని తాము చూస్తున్నామని, ఇది ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని రమాఫోసా పునరుద్ఘాటించారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించేలా, పాలస్తీనాలోని సాధారణ పౌరులను రక్షించేలా చర్యలు చేపట్టాలాని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దురాక్రమణను తిరస్కరించడంలో భాగంగా చర్చలు కోసం ఇజ్రాయిల్‌ నుండి తమ దౌత్యవేత్తలందరినీ వెనక్కి పిలవనున్నట్లు గతవారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.