Nov 08,2023 17:44

వాషింగ్టన్‌ :   అమెరికాలో  12 ఏళ్ల విద్యార్థిని రూ.21 లక్షల అవార్డు గెలుచుకుంది.   భారత సంతతికి చెందిన 12 ఏళ్ల  షాన్యా గిల్‌    స్మోక్‌ డిటెక్టర్‌ కన్నా వేగంగా పనిచేసే ఫైర్‌ డిటెక్టివ్‌ను అభివృద్ధి చేసింది.   ర్యాపిడ్‌ ఫైర్‌ డిటెక్షన్‌ డిటెక్టివ్‌ (ఆర్‌ఎఫ్‌డిడి) ను రూపొందించి    ..  సైంటిఫిక్‌ జూనియర్‌ ఇన్నోవేటర్స్‌ ఛాలెంజ్‌లో టాప్‌ అవార్డును అందుకుంది.  ఈ అవార్డు కింద 25 వేల డాలర్లు (రూ.21 లక్షలు) గెలుచుకుంది. 

కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివసించే షాన్యా గిల్ ..  థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఎస్‌సిఇఎన్‌డి (ఔత్సాహిక శాస్త్రవేత్తలు ఉత్తేజకరమైన నూతన ఆవిష్కరణలు ) అవార్డును సొంతం చేసుకుంది. మొత్తం 65,000 మంది విద్యార్థులు ఈ విభాగంలో పోటీపడ్డారు.

వివరాల ప్రకారం.. 2022 వేసవిలో షాన్యా ఇంటి వెనుక ఉన్న రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.   అప్పటి నుండి వాళ్ల అమ్మ  భయపడుతూ జాగ్రత్తగా  ఉండేవారని,  ఇంటి నుండి బయలుదేరే ముందు వంటగది స్టవ్‌ ఆఫ్‌ చేశామా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసేవారని అన్నారు.  ఒకరోజు షాన్య ..థర్మల్‌ కెమెరాలు శీతాకాలంలో నివాసాల్లో  వేడిని గుర్తించడాన్ని చూశారు. స్మోక్‌ డిటెక్టర్ల కన్నా త్వరగా ఈ కెమెరాలు ఇంటిలో మంటలను త్వరగా గుర్తించడం చూసి ఆశ్చర్యపోయింది.  ఈ సంఘటన తనను ఆర్ ఎఫ్ డి డి ని  రూపొందించేందుకు  ప్రేరేపించిందని అన్నారు. థర్మల్‌ కెమెరాను కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేయడం ద్వారా  ఫైర్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ను  అభివృద్ధి చేసినట్లు  తెలిపింది.    ఈ సిస్టమ్‌ ద్వారా ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నామని చెప్పారు.