కోల్‌కతా : ప్లేయింగ్ కార్డ్స్‌తో ఓ పదిహేనేళ్ల కుర్రాడు రికార్డు సృష్టించాడు. కోల్‌కతాకు చెందిన అర్నవ్ దాగ టేప్, జిగురు వంటివి ఏమీ ఉపయోగించకుండానే... ప్లేయింగ్ కార్డ్స్‌తో 40 అడుగుల భవనాన్ని సృష్టించాడు. ఇదే ప్రపంచంలోనే పెద్దదైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్ అని గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. ముందుగా కోల్‌కతాలోని ప్రసిద్ధ నిర్మాణాలు రైటర్ బిల్డింగ్, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ నిర్మాణాల దగ్గరకు వెళ్లి వాటి ఆర్కిటెక్చర్‌ని బాగా పరిశీలించి.. వాటి ఆధారంగా నిర్మాణాన్ని సృష్టించినట్లు అర్నవ్ చెప్పాడు. ఈ ఎత్తైన స్ట్రక్చర్ కోసం తాను దాదాపు 41 రోజులు కష్టపడ్డాడు. వీటి కోసం 143,000 ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించాడు. ఈ సందర్భంగా అర్నవ్ మాట్లాడుతూ.. 'ఒక్కోసారి పూర్తయిపోయింది అనుకున్న నిర్మాణం హఠాత్తుగా కూలిపోయేది. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి వచ్చినప్పుడు బాగా విసుగొచ్చేది. అయినాసరే కష్టపడి ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాను.' అని అన్నారు. అయితే అర్నవ్ పడిన కష్టానికి ఫలితం.. గత రికార్డుల్ని బ్రేక్ చేశాడు. గతంలో బ్రియాన్ బెర్గ్ అనే వ్యక్తి 34 అడుగుల ఎత్తుతో ఉండే ప్లేకార్డ్ స్ట్రక్చర్‌ను సష్టించి గిన్నీస్ రికార్డుకెక్కాడు. ఇప్పుడు బెర్గ్ రికార్డ్‌ను అర్నవ్ బ్రేక్ చేశాడు. ప్లేకార్డ్స్‌తో అర్నవ్ చేసే ప్రయత్నం యూట్యూబ్‌లో వీక్షిస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే.