భాగస్వాములుగా చూడండి
ఐరాస వేదికపై ఆఫ్రికన్ నేతల ఉద్ఘాటన
ఐక్యరాజ్యసమితి: ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆఫ్రికన్ నేతల ప్రసంగాలను మీరు వింటే, వారంతా ముక్త కంఠంతో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర క్రమంలో తమ ఖండం బాధితురాలుగా ఉంది. ఇది ఒక ప్రపంచ శక్తి. దీనిని పక్కన పెట్టడం కాదు, తప్పనిసరిగా భాగస్వామిని చేసుకోవాలి అన్నదే ఆ సందేశం. ఆఫ్రికాలో ఎక్కువ భాగం స్వాతంత్య్రం పొందింది. ఈ ఖండం 130 కోట్ల మందికిపైగా జనాభా కలిగిఉంది.దాని అభివృద్ధిని తొక్కిపెట్టే యత్నాల పట్ల అది అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్‌లో రెండు ఆఫ్రికన్ దేశాలను చేర్చుకోవడం, జి-20లో ఆఫ్రికన్ యూనియన్‌కు చోటు కల్పించడం జరిగింది. 'ఆఫ్రికాగా మేము ప్రపంచానికి ఒక్కటే చెప్పదలిచాము. మీరేదో భిక్షగానో, దాతృత్వంతోనో మా పట్ల వ్యవహరించాలని మేము కోరడం లేదు. మిగతా ప్రపంచంతో సమంగా కలసి పనిచేయడానికి భాగస్వాముల్ని చేసుకోండ'ి అని కెన్యా అధ్యక్షుడు విలియం రుటో చెప్పారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమ ఫొసా మాట్లాడుతూ, దోపిడీ, లొంగుబాటు వంటి వాటికి స్వస్తి పలికి మానవ పురోభివృద్ధిలో ఆఫ్రికా తన స్థానాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉందన్నారు.