జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 73కి చేరింది. జొహన్నెస్‌బర్గ్ నగరంలో ఐదంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. మంటలు అదుపులోకి వచ్చినా భవనమంతా దట్టమైన పొగ అలుముకొని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. వలస వచ్చిన వారు, నిరాశ్రయులు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండానే ఈ భవనంలో నివాసముంటున్నారని, అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని వెతకడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ భవనంలో సుమారు 200 మంది నివాసముంటున్నట్లు స్థానికులు తెలిపారు.