ట్యునీషియా : మధ్యదరా సముద్రంలో ట్యూనీషియా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 20 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. ఉత్తర ఆఫ్రికా నుండి మధ్యదర సముద్రం మీదుగా ఇటలీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 23 మంది ఆఫ్రికన్ వలసదారులు గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. శనివారం రెండు పడవలు ట్యునీషియా నుంచి మధ్యధరా సముద్రం దాటి ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు మునిగిపోవడంతో నలుగురు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గల్లంతైనవారి గురించి వేట సాగిస్తున్నారు. వీరిలో కూడా చాలా మంది మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. కోస్ట్ గార్డు మరో 53 మందిని రక్షించినట్లు, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఇటీవల కాలంలో ట్యునీషియా తీరంలో పడవ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో పేదరికం, సంఘర్షణల కారణంగా ప్రజలు ట్యునీషియా, లిబియాల నుండి యూరప్ వెళ్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు సబ్ పహారా ఆఫ్రికన్ దేశాల నుండి సముద్రం మీదుగా రహస్యంగా సరిహద్దు దాటేందుకు యత్నించిన 501పడవలను కోస్ట్‌గార్డ్ పెట్రోలింగ్ నిరోధించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. 14,406 మంది వలసదారులను రక్షించినట్లు తెలిపింది.