బ్యాంకాక్ : గల్ఫ్ ఆఫ్ థాయ్ లాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ యుద్ధ నౌక నీట మునిగింది. ఆదివారం సాయంత్రం గస్తీ చేపడుతుండగా మునిగిపోయినట్లు నేవీ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మంది నావికులను సహాయక సిబ్బంది కాపాడినట్లు వెల్లడించారు. గల్లంతైన 31 మంది కోసం సహాయక చర్యలు కొనసాగతున్నాయని అన్నారు. ఘటనకు సంబంధించిన దఅశ్యాలను థారు నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
థాయ్ లాండ్‌లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లోని సముద్ర తీరానికి 32 కిలోమీటర్లు (20 మైళ్ల) దూరంలో ఉన్న హెచ్‌టిఎంఎస్ సుఖొథాయ్ ఆదివారం సాయంత్రం గస్తీ చేపడుతోంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు రావడంతో సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరి విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిందని నేవీ అధికారులు తెలిపారు. సముద్రపు నీరు ఓడలోకి చేరడంతో మొబైల్ పంపింగ్ మిషన్ల ద్వారా నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ, బలమైన గాలులు, ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడంతో మరింత నీరు నౌక లోపలికి వచ్చింది. దీంతో నెమ్మదిగా నౌక ఓ వైపు ఒరుగుతూ నీట మునిగిపోయిందని అన్నారు. గల్లంతైన 31 మంది నావికుల కోసం నౌకలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నామని.. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.