
- ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిపై చర్చలో మంత్రులు ధర్మాన, ఆదిమూలపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ చట్టానికి తూట్లు పొడిచి, ఆ భూముల రికార్డులను మాయం చేసి, పేదలను బెదిరించి చంద్రబాబు నాయుడు అండ్‌కో భూములను లాక్కున్నారని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పిఒటి యాక్ట్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ శాఖ నుంచి జిఓ 41ని తీసుకొచ్చారన్నారు. సిఆర్‌డిఎ-ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అనే అంశంపై బుధవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అభివృద్ధి ఫలాలను తన వాళ్లకే దక్కేలా చేశారని, అదే తరహాలో అమరావతిలోనూ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అమరావతి గ్రాఫిక్స్‌తో చంద్రబాబు గారడీ చేశారని, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌కు చంద్రబాబు డైరెక్షన్ వహించగా, లోకేష్ పర్యవేక్షించారని ఆరో పించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్ మెంట్ మొత్తం లింగమనేని, హెరి టేజ్ భూముల పక్క నుంచి వెళ్లేలా మార్చినందుకు క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు కరకట్ట గెస్ట్ హౌస్‌ను ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే అంశంపై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారని, దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్లుగా రింగ్‌రోడ్డు స్కామ్ జరిగిందన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇన్నర్ రింగ్ రాబోతున్న ప్రాంతంలో ఎకరం ఆరేడు లక్షలు మాత్రమే ధర ఉండేదని, ఆయా భూములను పేదల వద్ద తక్కువ ధరకు కొని, అదే భూములను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చి రూ.కోట్లు సంపాదించుకున్నారన్నారు.