
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భూమి లేని గ్రామీణ పేదలు, దళితుల అభ్యున్నతి, ఆత్మగౌరవం, జీవనోపాధి కోసం ఇచ్చిన అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వమే ఈ తరహా ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. అసైన్డ్ చట్ట సవరణపై అన్ని రాజకీయ, వ్యవసాయ కార్మిక, దళిత సంఘాలతో తొలుత చర్చించాలని ఆయన కోరారు. ఆ తరువాతే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల వివరాలను గ్రామ సచివాలయంలో బహిరంగ పరచాలని కోరారు. రానున్న నెల రోజుల్లోపు అసెంబ్లీ సమావేశాలు ఉండగా ఆగమేఘాలపై ఎవరి ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తీరు చూస్తుంటే దళితులు, ఇతర పేదలకిచ్చిన అసైన్డ్ భూములను పెత్తందార్లకు కట్టబెట్టడానికే 9/77 చట్టాన్ని సవరించారని అర్ధమవుతోందన్నారు. రెండున్నర ఎకరా మాగాణి, ఐదుఎకరాల మెట్ట ఉన్న రైతులు అసైన్డ్ భూములు కలిగి ఉంటే వారిని మినహాయించాలని కోరారు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనల ఫలితంగా సుమారు 32 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని, ఇందులో సుమారు 15 లక్షల ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్లు కోనేరు రంగారావు భూ కమిటీ తేల్చిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమిని అనేక చోట్ల భూస్వాములు, పలుకుబడి కలిగిన వారు పారిశ్రామిక కేంద్రాలు, ఆక్వా చెరువులు, విద్యాలయాలు, నేషనల్ హైవేలు, విమానాశ్రయాలు పక్కనున్న దళితులకు చెందిన అసైన్డ్ భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు. కొన్ని చోట్ల పేదల బలహీనతను ఉపయోగించుకొని పావలో, పాతికో ఇచ్చి వారి భూముల్లో కలిపేసుకున్నారని,అన్యాక్రాంతమైన భూములను తిరిగి ఆ పేదలకే ఇవ్వాలని 9/77 చట్టం చెబుతోందని తెేలిపారు. ఈ చట్టం ఉండబట్టే భూములు కోల్పోయిన పేదలు పోరాడో, న్యాయస్థానాలను ఆశ్రయించో తిరిగి పొందుతున్నారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం ఈ భూములను కార్పొరేట్ కంపెనీలకు, రియల్టర్లకు, భూస్వాములకు కట్టబెట్టడానికే చట్ట సవరణ చేసి గవర్నర్ ద్వారా జూలై 31న ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని తెలిపారు. సవరించిన సెక్షన్ 3లో అసైన్డ్ భూమి మాస్టర్ ప్లాన్ పక్కన వ్యవసాయేతర అవసరాల కోసం (పరిశ్రమలు, విద్యాలయాలు, ఆక్వా, ఇతరములు) ఆక్రమించుకున్నట్లయితే ఆ భూములకు మార్కెట్ ధర ప్రకారంగా అసైన్డ్‌దారులకు డబ్బు చెల్లించాలని పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సవరణ ద్వారా ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను ఇలాంటి తప్పుడు పద్ధతుల పేరుతో రాజమార్గంలో కొట్టేయడానికి భూస్వాములకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని విమర్శించారు. దురాక్రమణ చేసిన ఆక్వా, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు పెట్టని ఖాళీ భూములను అసలు అసైన్డ్‌దారుల పరం చేయాలని డిమాండు చేశారు. పేదలు పొందిన అసైన్డ్ భూములను అభివృద్ధి చేసుకుని వారి జీవితాలు, పిల్లల భవిష్యత్ అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడి, సాగునీటి సౌకర్యం, పరపతి సౌకర్యం కల్పించి అభివృద్ధి చేయాల్సింది పోయి భూములు అమ్ముకోవచ్చని ప్రోత్సహించడం అభివృద్ధి నిరోధక చర్యని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సవరణ, అసైన్డ్ భూముల హక్కుదారుల కంటే అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములకు మేలు చేయడానికే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.