Aug 07,2023 00:06
5 దశల్లో 'అసైన్డ్‌' గుర్తింపు- గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా

అభ్యంతరాలకు ఏడు రోజులు గడువు
క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు జారీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ భూముల యజమానులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ, నిషేధిత భూముల జాబితానుంచి తొలగించేందుకు వీలు కల్పిస్తూ గత నెల 31న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి పాఠకులకు విధితమే ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. గెజిట్‌ నోటిఫికేేషన్‌ ఇచ్చే నాటికి 20 సంవత్సరాలు ముందు పట్టాలు పొందిన వ్యవసాయభూములు, పది సంవత్సరాలు దాటిన ఇంటిస్థలాలకు భూ యాజమాన్యహక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆయా భూములకు సంబందించి భవిష్యత్తులో అమ్ముకునే హక్కు, భూ బదలాయింపు చేసే హక్కు అసైన్డ్‌ పట్టాదారునికి సంక్రమించనుంది. ఇదే ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అసైన్డ్‌ భూములు, నివేశనస్థలాలు అసలైన లబ్ధిదారుల చేతుల్లోనే ఉన్నాయా? పట్టాలు పొందిన లభ్ధిదారులు నేటికీ ఆయా భూములపై పొజీషన్‌లో ఉన్నారా? లేక వారి వారసుల చేతుల్లో ఎంత మేర భూములు సాగులో ఉన్నాయనే అంశాలను సర్వే నెంబర్‌ వారీగా గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంత మేర భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయనే అంశాలను కూడా రెవెన్యూ అధికారులు గుర్తించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఐదు దశల్లో స్క్రూట్నీ చేసి తుది జాబితాను తయారు చేయాలని సిసిఎల్‌ఎ కమిషనరు సాయి ప్రసాద్‌ 26 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబదించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న అసలైన అసైన్ట్‌ దారుడే క్షేత్రస్దాయిలో భూమిమీద ఉన్నాడా లేదా అనేది తొలుత గుర్తించనున్నారు. తొలి దశలో గ్రామ రెవెన్యూ అధికారి(విఆర్‌ఓ) భూ రికార్డుల స్వచ్చీకరణ (పిఓఎల్‌ఆర్‌) కింద రెవెన్యూ రికార్డుల్లో గుర్తించిన అసైన్డ్‌ భూముల్లో వ్యవసాయ భూములు, నివేశన స్ధలాలకు కేటాయించిన వాటి వివరాలను పరిశీలించాలి. అనంతరం గతంలో రెవెన్యూశాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలతో సరిచూసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు డికెటి రిజిస్టర్‌, 1బి అండంగల్‌, రెవెన్యూ రికార్డులును పరిశీలిస్తూ మరొక వైపు క్షేత్రస్ధాయిలో భూమి స్వరూపాన్ని పరిశీలించాలి. ఇదే సందర్భంలో సర్వే నెంబరు వారీగా ఆయా భూములకు సంబందించిన వివరాలను విఆర్‌ఓ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా భూముల యజమానులు అసలైన వారా? లేక వారి వారసులా? అనే అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. లబ్ధిదారునికి భూమి ఏ సంవత్సరంలో కేటాయించారనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయా సర్వే నెంబర్ల భూములను 22(ఎ) నిషేధిత భూముల జాబితానుంచి తొలగించవచ్చని సూచిస్తూ మండల తహసీల్ధార్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
రెండో దశలో విఆర్‌ఓలు రికార్డులు సరిచూడలం, క్షేత్రస్ధాయి పరిశీలన పూర్తయిన అనంతరం నివేదికను ఆయా మండల తహసీల్ధారుగా అందజేయాల్సి ఉంటుంది. ఆయా రికార్డులను తహసీల్ధార్లు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు సంబందించి ఆయా భూముల్లో అసైన్డ్‌ లబ్దిదారులు లేకుండా ఆయా భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లి ఉంటే ఆ విషయాన్ని సిసిఎల్‌ఎ కార్యాలయంలోని సిఎంఆర్‌ఓ సెక్షన్‌కు ఇ- ఫైల్‌ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. సిఎంఆర్‌ఓ సెక్షన్‌ నుంచి అందే సూచనలను బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తహసీల్ధార్‌ విచారణ పూర్తి చేసిన అనంతరం అసైన్డ్‌ ల్యాండ్స్‌ వివరాలు, భూ యజమానుల వివరాలను ఆయా గ్రామ,వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డులో ప్రజలందరికీ వాస్తవ లబ్ధిదారులు ఎవరనే తెలిసే విథంగా వివరాలు నోటీసు బోర్డులో పెడతారు. ఆయా భూములకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే తెలుపుకునేందుకు ప్రభుత్వం 7 రోజులు సమయం ఇచ్చింది. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఆర్‌డిఓ/ సబ్‌ కలెక్టర్‌కు తహసీల్ధార్లు జాబితాను అందజేస్తారు.
మూడో దశలో మండల తహసీల్ధార్లు పంపిన జాబితాలో 5శాతం రికార్డులను ర్యాండమ్‌గా ఆర్‌డిఓ/సబ్‌ కలెక్టర్‌ పరిశీలించాల్సి ఉంటుంది. నాలుగో దశలో నివేదికను జాయింట్‌ కలెక్టర్‌కు పంపుతారు. మొత్తం నివేదికలో 1శాతం రికార్డులను జెసిలు ర్యాండమ్‌గా పరిశీలించాల్సి ఉంటుంది. రికార్డులన్ని పారదర్శకంగా ఉన్నాయని భావించిన అనంతరం ఆయా రికార్డులను అండర్‌ సెక్షన్‌ 22(ఎ) ఆఫ్‌ది రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ా1908 కింద ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా రిజిస్ట్రార్లకు పంపాల్సి ఉంటుంది. ఈ దశలన్ని దాటుకుని వచ్చిన నివేదికలను ఆయా జిల్లా కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా కలె క్టర్‌ అర్హుల జాబితాను ఆయా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపడంతో పాటు జిల్లా స్ధాయిలో గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు.