Oct 16,2023 08:13
  • పేదల సాగులో పది శాతమే !
  • కృష్ణా జిల్లా సర్వేలో తేలిన లెక్క
  • ఆ మేరకే లబ్ధిదారులకు తాజా హక్కులు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : పేదలకు 2003కు పూర్వం పంపిణీ అయిన అస్సైన్డ్‌ భూములపై పూర్తి స్థాయి హక్కు పత్రాలు ఇచ్చేందుకు కృష్ణా జిల్లా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసింది. అయితే, జిల్లాలో మొత్తం అసైన్డ్‌ భూముల్లో పదో వంతు భూమి మాత్రమే అసైనీలు, వారి వారసుల సాగులో ఉందనీ, ఆ మేరకు మాత్రమే హక్కుపత్రాలు అందజేయాలని అధికారులు నిర్ధారించారు. పేదలకు పంపిణీ అయినదాంట్లో 90 శాతం విస్తీర్ణంలోని భూములు నిబంధనలకు విరుద్ధంగా భూస్వాములు, పెద్దల స్వాధీనంలోకి వెళ్లిపోయినట్లు వారే అనుభవిస్తున్నట్టు సర్వేలో గుర్తించారు. పారదర్శకంగా ఉంచాల్సిన ఈ భూములకు సంబంధించిన సమాచారాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచడం పలు సందేహాలకు తావిస్తోంది. అసైన్డ్‌ భూములపై తాజా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే క్రమంలో ఏయే గ్రామంలో ఎంత అసైన్డ్‌ భూమి ఉంది? ఎవరి పేరుతో పట్టా ఉంది? ఎవరి స్వాధీనంలో ఆ భూమి ఉంది? అనే వివరాలను గ్రామ సచివాలయాలు, పంచాయతీల నోటీసు బోర్డుల్లో ఉంచుతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. నోటీసు బోర్టుల్లో ఎక్కడా అస్సైన్డ్‌ భూముల వివరాలు, లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించలేదు. పెద్దల స్వాధీనంలోని అసైన్డ్‌ భూములు వివరాలు బహిర్గతం కాకుండా ఉండేందుకే పారదర్శకత పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
            20 ఏళ్ల క్రితమే అసైన్డ్‌ భూములకు బి-ఫారం పట్టాలు పొందిన వాస్తవ లబ్ధిదారులు, వారసుల స్వాధీనంలోని అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం 9/23 ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పంపిణీ అయిన భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో నిర్థారించేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసింది.
        కృష్ణా జిల్లాలో పంపిణీ అయిన అసైన్డ్‌ భూమి 33,730.58 ఎకరాలకుగాను కేవలం 3,393.39 ఎకరాలు మాత్రమే వాస్తవ లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్నట్లు నిర్థారించారు. మిగిలిన 30,337 ఎకరాల భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్లో ఆక్వా చెరువులు తవ్వి రొయ్యలు, చేపల పెంపకం సాగిస్తున్నారు. దున్నేవానికే భూమి నినాదంతో గతంలో పెద్ద ఎత్తున జరిగిన భూ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వాలు భూములను పేదలకు పంపిణీ చేశాయి. దళితులు, గిరిజనులు, ఇతర పేదలకు బి-ఫారం పట్టాలు పొందారు. భూమి లభ్యతను ఆసరా చేసుకుని జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా 20 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకూ లబ్ధిదారులకు పంపిణీ జరిగింది. ఈ భూములు పొందిన లబ్ధిదారుల కుటుంబాలు సేద్యం చేసి ఫలసాయం పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ఈ భూముల క్రయ విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. అసైన్డ్‌ భూములను లబ్ధిదారులు అమ్మడం, లబ్ధిదారుల నుంచి కొనడం నేరమని పేర్కొంది. ఈ భూముల క్రయవిక్రయాలు జరిగితే ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ (పిఒటి) చట్టం కింద రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలి. కానీ, పాలకులు ఈ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేదల పేరున పట్టాలు ఉన్నా అసైన్డ్‌ భూముల్లో అత్యధిక శాతం అనధికారికంగా పెద్దల స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి.
 

                                                   ఆర్డినెన్స్‌తో పేదల భూములు కాజేసే ప్రమాదం

అసైన్డ్‌ భూముల లబ్ధిదారుల రక్షణకు అనేక చట్టాలున్నా ఆచరణలో అవి అమలు కావడం లేదు. దీంతో, ఈ భూములు ఎక్కువ మొత్తం భూస్వాములు, పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. భూములపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తామని చెబుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో భూములను అమ్ముకోవచ్చని ఆశ చూపి పేదల వద్ద ఉన్న ఆ కొద్ది అసైన్డ్‌ భూములను పెద్దలు కాజేసే ప్రమాదం ఏర్పడింది.
                             - ఆర్‌.రఘు, వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు

table