Apr 06,2023 16:21

డిస్పూర్‌  :   తాజ్‌మహల్‌, కుతుబ్‌మినార్‌ను కూల్చేయాలంటూ అస్సాం బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం కాదని మరియాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ వ్యాఖ్యానించారు. అలాగే  మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ను నిజంగా ప్రేమించాడా? అనే అంశంపై విచారణ జరపాలని అన్నారు. షాజహాన్‌ ముంతాజ్‌ల ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ అయితే.. ముంతాజ్‌ మరణించిన అనంతరం ఆయన మరో మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడని ప్రశ్నించారు.

తాజ్‌మహల్‌, కుతుబ్‌మినార్‌ను కూల్చివేయాలని, వాటి స్థానంలో ఆలయాలు నిర్మించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు. అలా నిర్మాణం చేసే ఆలయాలకు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. మొఘల్‌ చరిత్రపై కొన్ని అధ్యాయాలను ఎన్‌సిఇఆర్‌టి (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించినట్లు వచ్చిన వార్తలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుర్మీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

;