న్యూఢిల్లీ : అశోకా యూనివర్శిటీ రాజకీయ, ఎన్నికల సమాచార కేంద్రాన్ని తొలగించడం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. అశోకా యూనివర్శిటీ త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా (టిసిపిడి)ని రద్దు చేయడం, ఆ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్, అధ్యాపకుడు గిల్లెస్ వెర్నిర్స్‌ను తొలగించింది. ఈ చర్యను ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ ఎస్.వై. ఖురేషీ, క్రిస్టోఫ్ జాఫ్రలాట్ సహా పలువురు అధ్యయన వేత్తలు, నిపుణులతో కూడిన సైంటిఫిక్ బోర్డ్ ఖండించింది. రాజకీయ సమాచార కేంద్రాన్ని రద్దు చేయడం, దాని వ్యవస్థాపక డైరెక్టర్ గిల్లెస్ వెర్నిర్స్‌ను బలవంతంగా బయటకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాసింది.
ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణపై బలమైన సాక్ష్యం అవసరమని, టిసిపిడి భారత ఎన్నికలపై సమగ్రమైన, అత్యాధునిక విశ్లేషణతో కూడిన నాణ్యమైన సమాచారాన్ని అందించిందని వారు తెలిపారు. త్రివేది సెంటర్ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ బలవంతంగా నిష్క్రమించారని, సెంటర్ నాయకత్వాన్ని మాత్రమే కాకుండా ఓ సంస్థగా ఉన్న టిసిపిడి భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే నిర్ణయాల గురించి యూనివర్శిటీ సైంటిఫిక్ బోర్డుతో చర్చించలేదని చెప్పేందుకు మేము విచారిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
ఏడేళ్ల కాలంలో టిసిపిడికి చెందిన నిపుణులు, అధ్యయనవేత్తలు 16 అంశాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించారని, 20 రీసెర్చ్‌ప్రాజెక్టులు చేపట్టారని, 80 రీసెర్చ్ సెమినార్లు నిర్వహించారని, 20 రీసెర్చ్ పేపర్స్, పుస్తకాలను ప్రచురించారని, అలాగే రెండు ముఖ్యమైన సదస్సులు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ బృందం పత్రికలలో 300కి పైగా విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించిందని తెలిపారు. 2017లో ఫ్రాన్స్‌లోని సెంటర్ ఫర్ నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ (సిఎన్‌ఆర్‌ఎస్ ) నుండి సెరి -సైన్సెస్ పొ సహకారంతో 'అంతర్జాతీయ పరిశోధనా భాగస్వామి ' అనే పురస్కారాన్ని పొందిందని తెలిపారు.
అన్ని స్కాలర్‌షిప్స్, భారతీయ ఎన్నికలపై సమగ్ర వివరాలను అందించేందుకు టిసిపిడి ప్రధాన వనరని పేర్కొన్నారు. భారతీయ ఎన్నికలపై అధ్యయనానికి, కవరేజీకి ఈ సమాచారం నిపుణులు, జర్నలిస్టులకు అత్యవసరమని తెలిపారు. విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఈ కేంద్రం రద్దు గురించి ముందుగా సమాచార మివ్వలేదని మండిపడ్డారు.