Jul 27,2023 17:25

న్యూఢిల్లీ : మురుగు కాల్వలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరిచే కార్మికులు వాటిల్లోనే పడి చనిపోయేవారి సంఖ్య కేంద్ర ప్రభుత్వ లెక్కల కంటే ఎక్కువమందే వున్నారని, వీరి మరణాల సంఖ్యపై తప్పుడు లెక్కలు చూపుతున్నారని సఫాయి కర్మచారి ఆందోళన్‌ (ఎస్‌కెఎ) ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ ఏడాది (2023)లో మురుగు కాల్వలు, సెప్టిక్‌ ట్యాంకుల్లో పడి కేవలం తొమ్మిది మంది మాన్యువల్‌ స్కావెంజర్లు మాత్రమే మృతి చెందారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి రాందాస్‌ అథవాలే ఇటీవల వెల్లడించారు. అయితే వాస్తవానికి ఈ ఏడాదిలో 58 మంది మాన్యువల్‌ స్కావెంజర్లు చనిపోయారని, రాందాస్‌ చూపిన లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఎస్‌కెఎ విమర్శించింది. ఈ మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తూ... కేంద్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నదని తాజాగా ఎస్‌కెఎ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా గత ఐదేళ్ల కాలంలో సెప్టింక్‌, మురుగు కాల్వలో పడి 399 మంది మాన్యువల్‌ స్కావెంజర్లు చనిపోయారని ప్రభుత్వ అధికారిక సమాచారం పేర్కొంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పౌరులు తమ జీవితాలను కోల్పోతూనే ఉన్నారని.. ఈ మరణాలపై ప్రభుత్వం చూపిన లెక్కలు సరైనవి కావని ఎస్‌కెఎ నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా ఎస్‌కెఎ మురుగు కాల్వలు, సెప్టిక్‌ ట్యాంకుల్లో చనిపోయిన మాన్యువల్‌ స్కావెంజర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. వారికి ఉపాధి క్పల్పించడంతోపాటు, మరణాలకు సంబంధించి కూడా తాజాగా సర్వే చేపట్టాలని ఎస్‌కెఎ డిమాండ్‌ చేసింది. అలాగే 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తోంది. 2014 కోర్టు తీర్పు అనంతరం 1,315 మంది చనిపోయారని ఎస్‌కెఎ తెలిపింది. అయితే ఇప్పటివరకు కేవలం 266 మంది బాధిత కుటుంబాలకే పరిహారం అందిందని, ఇంకా 80 శాతం బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని ఎస్‌కెఎ పేర్కొంది. తక్షణమే మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని ఎస్‌కెఎ డిమాండ్‌ చేస్తోంది. మాన్యువల్‌ స్కావెంజర్ల జీవితాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌కెఎ డిమాండ్‌ చేస్తోంది. చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. మానవ హక్కుల్ని ఉల్లంఘించినట్లేనని, సుప్రీం ధర్మాసన తీర్పును అవమానించినట్లేనని ఎస్‌కెఎ స్పష్టం చేసింది.