న్యూఢిల్లీ : ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం సమాచార బిల్లు, 2023ని గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వాయిస్ ఓటింగ్ ద్వారా బిల్లుని ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ అనుమతించింది. '' ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2023'' ని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ద్రవ్య బిల్లు అని, రాజ్యసభ పరిశీలన నుండి దాట వేసేందుకు ఈ బిల్లుని రూపొందించారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమగ్ర పరిశీలన కోసం ఈ బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం, వాటి సంస్థలకు మినహాయింపు ఇవ్వడంపై ప్రతిపక్ష ఎంపిలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రూరమైన చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ప్రజల గోప్యత హక్కును అణచివేసేందుకు, వ్యక్తిగత సమాచారాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్, మనీష్ తివారి, శశిథరూర్, అధిర్ రంజన్ చౌదరి, ఎన్‌సిపి ఎంపి సుప్రీయా సూలే, టిఎంసి ఎంపి సౌగత్ రాయ్, ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్.కె. ప్రేమ చంద్రన్ సహా పలువురు ప్రతిపక్ష ఎంపిలు ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు సమాచార హక్కు చట్టం 2005 మరియు రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని బలహీనం చేస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.