Aug 01,2023 17:00

న్యూఢిల్లీ : డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డిపిడిపి) బిల్లు 2023 స్టాండింగ్‌ కమిటీ నివేదిక పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ నివేదకను ఆమోదించిన తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టని చట్టాన్ని కమిటీకి పంపలేమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిపిడిపి బిల్లు ద్వారా అధికార బిజెపి పార్లమెంటరీ నియమ, నిబంధనల్ని తగ్గిస్తోందని సోమవారం సిపిఐ(ఎం) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ ఆరోపించారు. పార్లమెంటరీ నియమ నిబంధనలను అధికార పార్టీ తుంగలో తొక్కుతోందని ఆయన అన్నారు. బిల్లుపై నివేదికను ఆమోదించడమే దానికి ఉదాహరణ అని బ్రిట్టాస్‌ ఆరోపించారు.
కాగా, కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై డిపార్ట్‌మెంట్‌ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ది వైర్‌తో మాట్లాడుతూ.. కమిటీ జూలై 26వ తేదీన 'సిటిజన్స్‌ డేటా సెక్యూరిటీ అండ్‌ ప్రైవసీ' పేరుతో నివేదికను ఆమోదించిందని చెప్పారు. అయితే, పార్లమెంటరీ నిబంధనలను దాటవేసేలా వున్న నివేదికను ప్రతిపక్ష సభ్యులు ఆమోదించరని అన్నారు. పార్లమెంటరీ విధానం ప్రకారం... బిల్లుపై ఏదైనా నివేదికను సమర్పించడానికి, స్టాండింగ్‌ కమిటీకి సిఫార్సు చేయడానికి ముందు పార్లమెంటులోని ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవలసి ఉంటుందన్నారు.
ఈ బిల్లుపై జూలై 28వ తేదీన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు బ్రిట్టాస్‌ లేఖ రాశారు. స్టాండింగ్‌ కమిటీ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వవద్దని, దానిని తిరిగి కమిటీకి పంపాలని బ్రిట్టాస్‌ స్పీకర్‌ని లేఖలో కోరారు.
మంగళవారం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత.. బ్రిట్టాస్‌ మాట్లాడుతూ.. 'డిజిటల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు నివేదిక స్టాండింగ్‌ కమిటీకి సూచించకుండానే.. సభలో ప్రవేశపెట్టకముందే క్యాబినెట్‌ ఆమోదం పొందింది. ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీ రూల్స్‌ను అతిక్రమించింది. మీ అధికారాన్ని, ఈ సభ యొక్క అధికారాన్ని ఉల్లంఘించడం వారి అధికార పరిధిని అతిక్రమించింది' అని బ్రిట్టాస్‌ అన్నారు.