Oct 07,2023 09:41

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆకస్మికంగా చనిపోయిన కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, గుంటూరు జిల్లా కార్యదర్శి లక్ష్మి, ఆశా కార్యకర్తలు మరియు సిఐటియు జిల్లా నాయకులను శుక్రవారం రాత్రి అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యను ఖండించాలని ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధ్యక్షురాలు కె.పోచమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పత్రికా ప్రకటన విడుదల చేశారు. 'ఈరోజు ఉదయం 6:30 గంటలకు  కె.ధనలక్ష్మి, లక్ష్మి తదితరులను బలవంతంగా వాహనాల్లో ఎత్తిపడేసి ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పకుండా గుంటూరు వైపు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి శనివారం ఉదయానికి కృపమ్మ కుటుంబానికి ఎక్స్గ్రేషియో ప్రకటన వస్తుందని నమ్మబలికన అధికారులు అందుకు విరుద్ధంగా నాయకులను ఆశా కార్యకర్తలను మరోసారి అరెస్టు చేయడం సిగ్గుచేటు. గురువారం మధ్యాహ్నం చనిపోయిన కృపమ్మ భౌతిక కాయాన్ని ఇంతవరకు కుటుంబ సభ్యులకు అందించలేదు. శవం ఎక్కడున్నదో కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. నిత్యం దళితుల గురించి మహిళల గురించి గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత సిగ్గుమాలిన విధంగా వ్యవహరించడం మహిళ లోకాన్ని నివ్వర పరుస్తోంది. జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో ఆశా వర్కర్లకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. దీని మూలంగానే చిత్తూరు జిల్లాలో జానకి అనే ఆశ వర్కర్ నాలుగు రోజుల క్రితం మృతి చెందింది.  ఇప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృపమ్మ చనిపోయింది. ఈ మృతులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి వీరు ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలను ఆదుకొని ఆశా వర్కర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమే గాక న్యాయం కోరుతున్న గొంతులు నొక్కి నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ప్రభుత్వ  దుర్మార్గ చర్యలను రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు ఖండించాలని' విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. చనిపోయిన ఆశ కార్యకర్తల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించాలి, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, జగనన్న సురక్ష పేరుతో ఆశా వర్కర్లపై మోపిన పని భారాన్ని తగ్గించాలి, అధికారుల వేధింపులు ఆపాలి, ఆశా వర్కర్లకు చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.