Dec 15,2022 07:33
  • గ్రామాల్లో వెయ్యి మందికి, అర్బన్‌లో 2,500 మందికి ఒక్కరే శ్రీ ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలపై తీవ్ర ప్రభావం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఆర్థిక భారం తగ్గించుకొనే పేరుతో ఆశా వర్కర్ల పోస్టులను కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా ఆశా కార్యకర్తలు అందిస్తోన్న సేవల పరిధి పెంచింది. ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లో 800 లోపు జనాభా ఉన్నా ఒక ఆశా కార్యకర్తను నియమించేవారు. అర్బన్‌ ప్రాంతాల్లో వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌ నియామకం చేపట్టారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వెయ్యి మంది జనాభా ఉంటేనే ఆశాను నియమిస్తారు. అర్బన్‌ ప్రాంతాల్లో కనీసం 2,500 మంది జనాభాకు మాత్రమే ఆశాను కేటాయిస్తారు. దీనిపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులకు ప్రభుత్వం వారం రోజుల క్రితం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. భవిష్యత్తులో చేపట్టనున్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీలో ఈ విధానం అనుసరించాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42 వేల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో భవిష్యత్తులో వీరి సంఖ్య తగ్గనుంది. వీరిని ఇప్పటికిప్పుడు తొలగించకపోయినా భవిష్యత్తులో ఖాళీలను భర్తీ చేయరని తెలుస్తోంది. దీంతో ఆ మేరకు పనిభారం పెరగనుంది.
ప్రభుత్వం నిర్దేశించినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది జనాభా ఉండి, అక్కడ ఖాళీ ఏర్పడితేనే ఆ పోస్టును భర్తీ చేస్తారు. అర్బన్‌ ప్రాంతంలోనూ అదే విధానాన్ని అనుసరించనున్నారు. ఒకవేళ వెయ్యిలోపు జనాభా ఉండి అక్కడ ఏదైనా కారణంతో ఖాళీ ఏర్పడితే, ఆ ప్రాంతాన్ని సమీప సచివాలయ పరిధిలోని ఆశా కార్యకర్తకు అప్పగించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆశాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తీవ్ర ప్రభావం పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల 300 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌ (కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌) ఉన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆశా పరిధిలోకి 300 జనాభా ఉండే మరో మూడు నాలుగు గిరిజన గూడేలు అదనంగా చేరనున్నాయి. దీంతో, గర్భిణులు, చిన్నారులకు సకాలంలో వైద్య సేవలు అందడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఖర్చు తగ్గించుకునేందుకేనా?

ఆశాలకు వేతనాల రూపంలో చెల్లిస్తున్న ఖర్చును తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ సాగుతోంది. ఆశాలకు గతంలో ప్రసవాలు, నవజాత శిశువులు, కుటుంబ నియంత్రణ, ఇమ్యునైజేషన్‌ తదితర పనులు మాత్రమే ఉండేవి. ప్రసవానికి రూ.250, కుటుంబ నియంత్రణకు రూ.100, ఇమ్యునైజేషన్‌కు రూ.100 ఇలా పనికి తగిన పారితోషికం ఇచ్చేవారు. ఆశాల ఆందోళనల ఫలితంగా 2018 ఆగస్టులో అప్పటి టిడిపి ప్రభుత్వం వీరికి నెలకు రూ.2,800 చెల్లించేది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైసిపి ప్రభుత్వం 2019 జులై నుంచి నెలకు రూ.పది వేలు చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. వేతనాలు పెంచిన ప్రభుత్వం అంతకుమించిన పనులను వారికి అప్పగించింది. గతంలో నిర్వర్తించిన విధులతోపాటు సచివాలయాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి కుటుంబాల ఆరోగ్య పరిస్థితి, బిపి, సుగర్‌, లెప్రసీ, కుష్టు వ్యాధి తదితర సర్వేలన్నీ వీరితోనే చేయిస్తోంది. పొరుగునే ఉన్న సచివాలయాలనూ అప్పగిస్తే వారిపై మరింత పనిభారం పెరగనుంది.

  • అర్హతలనూ మార్చిన ప్రభుత్వం

ఆశా పోస్టులకు ఇప్పడున్న అర్హతల్లోనూ మార్పు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తగా పనిచేయాలంటే గతంలో ఎనిమిదో తరగతి అర్హత కాగా, ప్రస్తుతం దాన్ని పదో తరగతికి మార్చింది. అర్బన్‌ ప్రాంతాల్లో పదో తరగతి అర్హతగా పేర్కొన్నా ఇంటర్‌, ఎఎన్‌ఎం, జిఎన్‌ఎం తదితర అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు ఉండాలని నిర్దేశించింది.