Aug 06,2023 11:47
  • ఫెడరేషన్‌ ఆలిండియా ప్రధాన కార్యదర్శి మధుమిత బందోపాధ్యాయ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆశా వర్కర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, దీనికి నిరసనగా అక్టోబరు 30న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆశా వర్కర్స్‌ అండ్‌ ఫెసిలిటేటర్స్‌ ఫెడరేషన్‌ ఆలిండియా ప్రధాన కార్యదర్శి మధుమిత బందోపాధ్యాయ తెలిపారు. రెండు రోజులపాటు వడ్డేశ్వరంలో జరిగిన ఫెడరేషన్‌ ఆలిండియా సమావేశాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశావర్కర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు. కనీస వేతనం, చట్టబద్ధమైన సౌకర్యాల కోసం వివిధ రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లు ఉమ్మడి పోరు నిర్వహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించి చెల్లించాలని, తొలగింపులు, వేధింపులు ఆపాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవ్స్‌ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని అన్నారు. బీహార్లో జులై 12 నుండి సమ్మె జరుగుతోందని, అది న్యాయ సమ్మతమైందని దేశవ్యాప్తంగా ఉన్న వర్కర్లందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రభుత్వానికి ఆశా వర్కర్లతో చాకిరీ చేయించుకోవడం తప్ప వారిగోడు వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యపోరాటాల ద్వారా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, దీనిలో భాగంగా ఈ నెల 24న ఢిల్లీలో జరిగే స్కీమ్‌ వర్కర్ల సదస్సుకు ఆశా వర్కర్లకు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
        రాబోయే కాలంలో స్కీమ్‌ వర్కర్లతో కలిసి పోరాడేందుకు ఆశాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మణిపూర్లో మతాల మధ్య చిచ్చుపెట్టి మహిళల మాన ప్రాణాలను బలితీసుకుంటున్నారని అన్నారు. ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి హత్య చేసిన ఘటనతో దేశం పరువు పోయిందన్నారు. బిజెపి ఓట్ల రాజకీయాల కోసం బలహీనవర్గాలను, మైనార్టీలను బలితీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలకు లాభం చేకూర్చిపెట్టేందుకు మోడీ నిరంతరం పనిచేస్తున్నారే తప్ప ప్రజల బాగోగులు పట్టడం లేదని అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే మోడీ విధానాలకు వ్యతిరేకంగా తొమ్మిదో తేదీన ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ దేశ వ్యాప్తంగా జరిపే క్విట్‌ మోడీ, సేవ్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
           ఆగస్టు 14న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మోడీ విధానాలను ఎండగట్టాలన్నారు. సమావేశాలు ప్రారంభంగా ఫెడరేషన్‌ అధ్యక్షులు పిపి ప్రేమ సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఉపాధ్యక్షులు వీణాగుప్త సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మణిపూర్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అఖిల భారత ఉపాధ్యక్షులు కె ధనలక్ష్మి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కోశాధికారి పుష్ప బలపరిచారు. ఆశా వర్కర్ల సమ్మెను బలపరుస్తూ సురేఖ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎటి పద్మనాభన్‌ బలపరిచారు. అన్ని తీర్మానాలను కమిటీ ఏకగ్రీవంగా బలపరిచింది.