Jun 11,2023 15:14

ప్రజాశక్తి-నర్సిపట్నం టౌన్(అనకాపల్లి) : మానస పుత్రికగా పేరొందిన ఏరియా ఆసుపత్రి మనోవేదనకు గురవుతుంది.  పది పడకలతో చిన్న పెంకుల ఇంట్లో ఉండే ప్రభుత్వ వైద్యశాల 150 పడకల ఆసుపత్రిగా ఆవిర్భవించింది. అలాంటి ఏరియా ఆసుపత్రి లో వైద్యం అంటే ప్రజలుకు అందని ద్రాక్ష గా తయారైయింది. ఆసుపత్రిలో అవినీతి అధర్మం రాజ్యమేలుతోంది. సదరం సర్టిఫికెట్లు నుండి అంబులెన్స్ ఏర్పాటు చేసే వరకు ప్రతిదానికి ఒక రేటు కుదిర్చారు. ఇటీవల గొలుగొండ మండలానికి చెందిన సత్యనారాయణ, మాకవరపాలెం మండలం శ్రావణ్ కుమార్ సదరన్ సర్టిఫికెట్ గురించి వెళ్లినప్పుడు మధ్యవర్తులు డబ్బులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో చోటా నాయకులుగా చలామణి అవుతున్న మధ్యవర్తులు డాక్టర్లతో కుమ్మక్కుఅయి వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్, కంటి డాక్టర్లు వసూళ్లు ఇటీవల బయట పడ్డాయి.  ఇక్కడ డాక్టర్లతో ముందుగానే బేరాలు కుదుర్చుకుంటారు. అడుగడుగునా అవినీతితో  కంపు కొడుతోంది. కిటకిటలాడే  ఆసుపత్రి రోజు రోజుకి వైద్య సేవలకు దూరమై సిబ్బందిలో నిర్లక్ష్యం, నిర్లిప్తత చోటు చేసుకుంది. 2018లో ఉత్తమ పురస్కారాల పొందిన ఏరియా ఆసుపత్రి అవమాన పాలవుతుంది. డివిజన్ కేంద్రమైన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు ఏజెన్సీ గిరిజన ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాంటి ఈ పేదలకు ఇక్కడ వైద్యం దయనీయంగా మారింది. పూర్తిస్థాయిలో వైద్యులు వ్యాధి నిర్ధారణ ల్యాబ్, ఎక్సరే, ఈసీజీ, డయాలసిస్ వంటి యూనిట్లు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందడం లేదనేది నర్సీపట్నం ప్రాంత ప్రజలు బహటంగానే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగా మారిందన్న విమర్శలు వినపడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి ని విడిచి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటివరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ జరిపిన దాఖలాలు లేవని రోగుల బంధువులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపి జనరల్ చెకింగ్, ఇంజక్షన్ రూమ్, ఫార్మసీ వంటి జనరల్ వార్డ్ వంటి బ్లాకులు ఉండగా రెండు అంతస్తులో రక్త పరీక్ష కేంద్రం, స్త్రీల వార్డు, ఎమర్జెన్సీ వార్డు,  సర్జరీ వార్డులు ఉన్నాయి. ఇలా మూడు అంతస్తులు భవనం కలిగిన ఏరియా ఆసుపత్రికి  డాక్టర్లు తిరగాలంటే లిఫ్ట్ కావాలి అలాగే రోగులు వెళ్లేందుకు, రోగులు బంధువులు వెల్లేందుకు లిఫ్ట్ కావాలి అలాంటి లిఫ్టు సుమారు సంవత్సరం పూర్తి అవుతున్న నేటికీ అతీగతీ లేకుండా పోయింది. 150 పడకల ఆసుపత్రి, గా అప్ గ్రేడ్ కావడం, డయాలసిస్, కార్డియాలజీ, రక్త పరీక్షా కేంద్రం, చిన్నపిల్లలకు ప్రత్యేక వార్డు అలాగే ఆసుపత్రి సోలార్ సిస్టంతో పనిచేసే విధంగా సోలార్ ప్లాంటేషన్ ఏర్పాటు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ద్వారా ఏర్పాటు చేశారు.  ఈ మేరకు అయ్యన్న మానస పుత్రికగా ఆసుపత్రికి నామకరణం చేసి అన్ని విధాల అభివృద్ధి చేశారు. అటువంటి ఏరియా ఆసుపత్రి దుస్థితిని చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. నేటికీ జనరేటర్ పనిచేయటం లేదు కరెంటు పోతే సెల్ఫోన్ వెలుగులలో ఆపరేషన్ చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి 2020 సంవత్సరం గొలుగొండ మండలానికి చెందిన ఒక ఆమె కు సెల్ ఫోన్ వెలుగులో ప్రసవం చేశారు. సెల్ఫోన్ వెలుగులలో ఆపరేషన్ చేయడం స్థానికులను విస్తుపరిచింది. ఆరు నెలల క్రితం ఒక డాక్టర్ పర్యవేక్షణ అధికారి గా పనిచేస్తూ ఆసుపత్రిలో సేవలందించేందుకు విరాళాల రూపంలో వేలకువేలు డబ్బులు వసూలు చేశారు. మూడు ఇన్వర్టర్లు తప్ప మిగతా ఏవీ ఎక్కడా కనిపించడం లేదు. ఇలా అనేక రూపాల్లో దోపిడి జరుగుతున్నప్పటికీ అధికారుల తీరు మాత్రం మారలేదు. చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆసుపత్రికి అవినీతి సిబ్బంది తీరు, విధానాలు వలన చరిత్రకు చెదలు పట్టే పరిస్థితి ఏర్పడి మానస పుత్రికగా పిలుచుకున్న ఏరియా ఆసుపత్రి మనోవేదనకు గురవుతుంది.