- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 323 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్‌లో పంటలు సాధారణ సాగు కాలేదని తెలిపారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 28 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదన్నారు. అక్టోబరు నెల పూర్తి కావస్తున్నా 440 మండలాల్లో వర్షం పడకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రబీ పంటలు వేయడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని, డెల్టా ప్రాంతంలో సైతం తగినంత నీరు సరఫరా కాకపోవడంతో కాలువ చివరి భూముల కింద పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పోసినా, వాగులు, చెరువులు, మురుగు కాలువల నుంచి ఆయిల్ ఇంజిన్లతో కిలోమీటర్ల దూరం పైపులతో నీరు తోడిపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అందించేందుకు ఎకరాకు రూ.30 వేలు రైతులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉన్న పంటలను కాపాడటానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోత లేకుండా తొమ్మిది గంటలు అందించాలని, ఖరీఫ్ పంటలు వేయలేకపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షాభావం, కరువు కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని వారు కోరారు. అన్ని పంటలకూ సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని కోరారు.