Aug 04,2023 11:42

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : విజయవాడలో ఈనెల 7న రైతులు, కౌలు రైతులు చేపట్టనున్న చలో విజయవాడను అందరూ జయప్రదం చేయాలని మండలంలోని కొండాపురం గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చిన్నప్ప యాదవ్‌ మాట్లాడుతూ ... జిల్లావ్యాప్తంగా రైతులు వ్యవసాయం సాగు చేయాలంటే అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. రైతులకు సాగు సాయం కింద ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని, పంట పెట్టిన ప్రతీ రైతుకు పంటల బీమా అందించాలని, 50 సంవత్సరాల నుండి ప్రతి రైతుకు రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. బిందు, తుంపెర సేద్య పరికరాలు, విత్తనాలు, ఎరువులు 90 శాతము సబ్సిడీ తో ఇవ్వాలని, ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు కేటాయించాలని, ప్రకఅతి విపత్తుల నిధి సాయం కింద రూ.4 వేల కోట్లు కేటాయించాలని, వ్యవసాయపనులకు ఉపాధి పనులను అనుసంధానము చేయాలని, అనేకమైన డిమాండ్లతో విజయవాడ కేంద్రంలో ఈనెల 7న ధర్నా చౌక్‌ వద్ద ఏపీ రైతు సంఘము రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా రైతులు, కౌలురైతులు తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం పిలుపునివ్వడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు శివారెడ్డి, సింగనమల నియోజకవర్గ రైతు సంఘం సహాయ కార్యదర్శి గోపాల్‌, శేఖర్‌, రైతులు సుందరమూర్తి, మధుసూదన్‌, నాగముని, కూల్లాయప్ప, నియోజకవర్గం నాయకులు కడవకల్లు కుల్లయప్ప, సంజీవపురం కుల్లాయప్ప, చిన్నికృష్ణుడు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.