ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నవంబరు నెల 26, 27, 28 తేదీల్లో రాజ్‌భవన్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేసేందుకు 8మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి నియమించింది. ఇందులో మాజీమంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, వై.కేశవరావు, కెవివి ప్రసాద్, జి.ఓబులేషు, యు.ఉమామహేశ్వరరావు, చుండూరు రంగారావు, సింహాద్రి ఝూన్సీ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఉన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాలు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ త్వరలో సమావేశమై మరికొన్ని సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం వడ్డే శోభనాధ్రీశ్వరరావు మీడియాతోమాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా రాజ్‌భవన్ వద్ద మహాధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాకంటకమైన ఉపా, దేశద్రోహం, మనీ లాండరింగ్ లాంటి నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షనాయకులను ,సంస్థలను వేధిస్తోందని అన్నారు. అదే సమయంలో రైతు కార్మిక విధానాలను అనుసరిస్తోందన్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు జి.ఓబులేషు మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదను అదాని, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోందన్నారు. కృష్ణా జలాల పంపిణీ సక్రమంగా లేదని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయం సిఎంకు తెలిసినా ఏమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం, కార్మిక సంఘాల నాయకులు, ఎపి రైతు స ంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు, కుర్రా నరేంద్ర, పి.జమలయ్య, చేండూరు ర ంగారావు, ఎవి నాగేశ్వరరావు, వి.కృష్ణయ్య, వి.వెంకటేశ్వర్లు, దడాల సుబ్బారావు, వి.కృష్ణయ్య, ఎం.గిరీష్, కె.బసవయ్య. ఎ.రవిచంద్ర, గొల్లపూడి ప్రసాద్, కె.వీరబాబు పాల్గొన్నారు.