ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ (గుంటూరు): నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. గురువారం ఎంటిఎంసి పరిధిలోని చిర్రావూరు గ్రామంలో రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మొలకెత్తిన వరి పైరులన్నీ నీట మునిగాయన్నారు. చిర్రావూరు గ్రామంలోని సుమారు 170 ఎకరాలు వరి పైరు నీట మునిగిందని అన్నారు. తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, గుండి మెడ, ఇప్పటం గ్రామాలలో పంటలు నీట మునిగాయని అన్నారు. దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఒక్కో ఎకరానికి 5000 నుండి 7000 రూపాయల వరకు వరి సాగుకు (ఎద పద్ధతి)లో ఖర్చయ్యాయని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 5000 రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పంట పొలాలు ముంపునకు ప్రధాన కారణం నూతక్కి నుండి చిర్రావూరు ప్రాతూరు మీదుగా తాడేపల్లి వరకు రోడ్డు కిరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలు రోడ్డు విస్తరణలో భాగంగా పూడుకు పోయాయన్నారు. దీంతో వర్షపు నీరు అధికంగా చేరి, పొలాలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. పంట పొలాల ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను పూడిక తీయించి, పంట పొలాలు ముంపుకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం చిర్రావూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం అధికారిని ఎన్.శాంతిశ్రీని కలిసి నీట మునిగిన వరి పొలాల రైతులను ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు పరిమిశెట్టి శివ నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు మేడూరి పాములు, కౌలు రైతులు పల్లపాటి సుబ్బారావు, నారం శెట్టి బిక్షాలరావు, పల్లపాటి అనిల్ కుమార్, వల్లం శెట్టి కాళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.