Oct 08,2023 21:10

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి:భారత రాజ్యాంగం దాని అనుబంధ వ్యవస్థల గురించి ప్రజల్లో చైతన్యం పెరిగితే ప్రజాస్వామ్య పరిరక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె మన్మధరావు అన్నారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఆదివారం 'రాజ్యాంగ చర్చా వేదిక' ఆవిర్భావ సభ నిర్వహించారు. సభకు హాజరైన జస్టిస్‌ మన్మధరావు మాట్లాడుతూ ఆధునిక స్వతంత్ర భారత నిర్మాణంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సారథ్యంలో రూపొందించిన భారత రాజ్యాంగంలో పౌరులకు సంబంధించి ప్రాథమిక హక్కులు, న్యాయం, అభివృద్ధి, పరిపాలన గురించి విశేషంగా చర్చించబడిందని తెలిపారు. భారత రాజ్యాంగం అనేక అభివఅద్ధి చెందిన దేశాల రాజ్యాంగాల పరిశీలన ద్వారా ముఖ్యంగా అన్ని కోణాలలో మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ రాయబడిందన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా సామాన్య ప్రజల్లో రాజ్యాంగం పట్ల నేటికీ పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం, ఒపిడిఆర్‌ వంటి సంస్థలు ప్రజాస్వామ్య హక్కుల కోసం కొంతవరకు కృషి చేయడానికి ప్రయత్నిచాయన్నారు. అన్ని సమస్యలకు కోర్టులే పరిష్కారం అన్న అపోహలను విడనాడాలని చెప్పారు. 'రాజ్యాంగ చర్చా వేదిక' సంస్థ రాజకీయాలకతీతంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరక్షరాశ్యులను, విద్యావంతులను రాజ్యాంగ మౌలిక సూత్రాలపై చైతన్య పరచాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎ రాజేంద్రప్రసాద్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ తాతా సేవ కుమార్‌, రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షులు నడింపల్లి గురుదత్‌, వేదిక ఉపాధ్యక్షులు మేడా శ్రీనివాస్‌, కార్యదర్శి అవధానుల హరి, కోశాధికారి పిఎస్‌ మూర్తి, గౌరవ సలహాదారులు నడింపల్లి కమలకాంత్‌, ఎంవి రాజారామ్‌ తదితరులు పాల్గొన్నారు.