Oct 03,2023 15:56
  • బ్లాక్‌ డేలో ప్రజా, రైతు, కార్మిక సంఘాల నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు : వ్యవసాయ నల్ల చట్టాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల ప్రక్రియకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న రైతులపైకి ఉద్దేశ్య పూర్వకంగా జీపు నడిపి 4 గురు రైతుల మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజరు కుమార్‌ మిశ్రాను మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ చేయాలని మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా ను ఉరి శిక్ష వేయాలని ఎపి రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రం నరసరావుపేట పట్టణంలో మంగళవారం ప్రజా, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్‌ డే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుండి ధర్నా చౌక్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌ లుగా కుదించి కార్మికుల హక్కులను యాజమాన్యాలకు తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. రైతు నాయకులపై కార్మిక నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని లేని పక్షంలో దేశ వ్యాప్తంగా మరో రైతాంగ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ 2 ఏళ్ళ క్రితం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేస్తూ 700 మంది రైతులు చనిపోవడం జరిగిందని మతి చెందిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక, రైతు సంఘాల పైన పెట్టినటువంటి అక్రమ కేసులను తొలగిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన మోడీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని లేని పక్షాన వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివ కుమారి మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి సిలార్‌ మసూద్‌, జన విజ్ఞాన వేదిక నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌, మస్తాన్‌ వలి,ఏఐకెఎఫ్‌ జిల్లా కార్యదర్శి రెడ్‌ బాష, ఏఐటియుసి జిల్లా నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్‌ ,దాసరి వరహాలు, అంకమ్మరావు , రమణయ్య మస్తాన్‌ పినబోయిన వెంకటేశ్వర్లు, మల్లికార్జున, కార్మికులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.