- తాడేపల్లిలో ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు
- ప్రత్యామ్నాయం చూపకుండా అధికారుల హడావుడి
- సర్కారు తీరుపై గుంటూరు, ఎన్టిఆర్ జిల్లాల లబ్ధిదారులలో అసంతృప్తి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, ఎన్టిఆర్ జిల్లాలకు చెందిన 50 వేలమంది పేద కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. తాము నివశించే ప్రాంతంలో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించకుండా రాజధానిలో స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హైకోర్టు స్టే ఉత్తర్వులతో నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారు అయింది. రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు గత నెల 3వ తేదీన స్టే ఇచ్చింది. ఈ స్టే ఉత్తర్వులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ఈనెల ఒకటో తేదీన స్టే వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఆర్ - 5 జోన్లో ఇళ్ల నిర్మాణం మరింత అయోమయంలో చిక్కుకుంది. హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణకు నవంబరుకు వాయిదా వేసింది. నవంబరు అంటే దాదాపుగా ఎన్నికల సమయం సమీపిస్తుందని, ఇక ఇళ్ల నిర్మాణాలు జరిగే అవకాశం లేదని లబ్ధిదారులు ఆశలు వదులుకున్నట్టేనని అధికారులు నర్మగర్భంగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో తాడేపల్లిలో సీఎం నివాసానికి సమీపంలో నివశిస్తున్న దాదాపు వెయ్యి కుటుంబాల వారిని ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. దీంతో తాడేపల్లి నివాసితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చివరికి రాజధానిలో కేటాయించారని, చివరికి అక్కడ కూడా తమకు ఇళ్లు నిర్మించుకునే అవకాశం రాలేదని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని తాడేపల్లి వాసులు వాపోతున్నారు. తమకు రాజధానిలో ఇల్లు వస్తుందనుకున్న నమ్మకం పోయిందని లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి జులై 24న సిఎం జగన్ శంకుస్థాపన చేశారు. మే 26న పట్టాలు పంపిణీ చేసి జులై 8న ఇళ్ల నిర్మాణానికి ప్రకటించినా శంకుస్థాపన చేస్తామని కొన్ని అవాంతారాలను అధిగమించి జులై 24న శంకుస్థాపన చేశారు. అయితే ఆగస్టు 3న హైకోర్టు స్టే విధించింది. దీంతో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. అమరావతిపై పట్టు సాధించేందుకు సిఎం జగన్ ఇళ్ల స్థలాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఆచరణలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు గత మూడేళ్లుగా రాజధానిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆశపెట్టి ఇప్పుడు ఎటూకాకుండా చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా సుప్రీంకోర్టులో సానుకూల ఉత్తర్వుల కోసం వేచి ఉండటం వల్ల తమకు ఇప్పట్లో ఇళ్లు దక్కే అవకాశం లేదని లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు.