
రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, అందుకు ప్రభుత్వమే ప్రధాన కారణం కావడం తీవ్ర అభ్యంతరకరం. గత కొద్ది వారాలుగా కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు తోడుగా, పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డగింత, జెఎసి పేరుతో అధికార పార్టీ విశాఖలో చేసిన బలప్రదర్శన రాష్ట్రంలో మరోసారి రాజకీయాలను వేడెక్కించాయి. అందరూ కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలుగుదేశం, జనసేన నేతలు మంగళవారం సంయుక్తంగా పిలుపునిచ్చారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆ వెంటనే అధికార పార్టీ నిందాపూర్వక విమర్శలు సరేసరి. అయితే ఈ పరిణామాలన్నింటి మధ్యలో తప్పించుకు తిరుగుతున్న అసలు దోషి బిజెపి. రాజధాని నిర్మాణ సమస్యతో పాటు, రాష్ట్రంలోని కీలకమైన సమస్యలకు మూల కారణమైన బిజెపి పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు పెద్దమనిషిలాగా సుద్దులు చెబుతున్నది.
ప్రధాన పార్టీలు బండబూతులు తిట్టుకోవడం, అత్యంత మొరటుగా సవాళ్ళు విసురుకోవడం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్తుపోతున్నారు. విసిగిపోతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అధికార పార్టీ... వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన తెలుగుదేశం...రాజకీయ అస్పష్టతతో తాను అనుసరిస్తున్న వైఖరి బిజెపి విస్తరణకు తోడ్పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించని జనసేన...కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లుతూ రాష్ట్రంలో పోటీలు పడి రాజకీయాలను బజారుపాలు చేస్తున్నాయి. ఈ పార్టీల వైఖరులు రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగకరం కాదు. బిజెపి ఉచ్చులో పడిన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తాము అనుసరిస్తున్న వైఖరులు అంతిమంగా బిజెపికి తోడ్పడి అసలుకే ఎసరు వస్తుందనే విషయాన్ని గుర్తించడంలేదు.
- రాజధాని నిర్మాణానికి బిజెపి ద్రోహం
నూతన రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి కోసం మోడీ, బాబుల జోడీ అంటూ 2014 ఎన్నికల సందర్భంగా బిజెపి, టిడిపిలు ఐక్యరాగం ఆలపించి అధికారంలోకి వచ్చాయి. అమరావతిలో నిర్మించే నూతన రాజధాని నిర్మాణానికి రూ.42 వేల కోట్లు అవసరమని గత రాష్ట్ర ప్రభుత్వం (ఆ ప్రభుత్వంలో బిజెపి కూడా భాగస్వామి) అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపింది. రాజధాని శంకుస్థాపనకు నిధులతో రావలసిన ప్రధానమంత్రి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళతో వచ్చి మొదట్లోనే అపశకునం పలికారు. గత ఏడు సంవత్సరాల్లో కేంద్రం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించింది. రాజధాని నిర్మాణ జాప్యానికి కేంద్ర నిర్లక్ష్య వైఖరి కారణమైంది. సమస్యను తిరగదోడడానికి మూలమైంది. మూడు సంవత్సరాలుగా రాజధాని వివాదం నడుస్తుంటే బిజెపి అగ్నికి ఆజ్యం పోసింది తప్ప పరిష్కారానికి తోడ్పడలేదు. ఇక్కడ బిజెపి నాయకులు అవకాశవాద ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతిలో 42 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాలు కేటాయించారు. అందులో ఇప్పటి వరకు రెండు సంస్థల నిర్మాణానికి మాత్రమే కేంద్రం అనుమతులు ఇచ్చింది. రాజధాని ఏర్పాటు పట్ల బిజెపి ద్రోహపూరిత వైఖరికి ఇది నిదర్శనం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ స్వభావం గురించి బాగా తెలిసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆర్థిక శక్తికి తగ్గట్టుగా నిర్మాణం చేపట్టకుండా, మలేషియా, సింగపూర్ అంటూ అద్భుత గ్రాఫిక్‌లతో, తాత్కాలిక రాజధాని అంటూ టెంట్లు, షెడ్‌లు వేయడం ప్రారంభించారు. దీంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైంది. ల్యాండ్‌పూలింగ్ పేరుతో వేల ఎకరాల భూసేకరణ తగదని, అమరావతిలో రాజధాని నిర్మాణంతోపాటు, అభివృద్ధి వికేంద్రీకరించబడాలని ఆనాడే సూత్రబద్ద వైఖరిని సిపిఎం ప్రకటించింది. అదే విధానానికి నేటికీ కట్టుబడి వుంది.
- వైసిపి ద్వంద్వ వైఖరి
అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరపాలనే తీర్మానాన్ని శాసనసభలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదిస్తే, ప్రతిపక్ష వైసిపి ఆమోదించింది. 2109లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గాని, తమ మానిఫెస్టోలో గాని రాజధాని మార్పు ఊసే ఎత్తని వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని ప్రాంతాన్ని వివాదాస్పదం చేసింది. మూడు రాజధానుల విధానాన్ని ఎత్తుకుంది. రైతుల ఉద్యమాన్ని హేళన చేయడం, వారికి మద్దతుగా వున్న పార్టీలపై నిందారోపణలు చేయడం, అమరావతిని కుల సమస్యగా చిత్రీకరించడం తోనే సుమారు నాలుగు సంవత్సరాల పాలనా కాలాన్ని వృధా చేసింది. ఇప్పటికీ వివాదాన్ని రగిలిస్తూనే వుంది. వైసిపి వైఖరిని ఆదిలోనే ఆపాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా మూడు పార్టీల మధ్య దాగుడుమూతలు ఆడుతూ నిధులు ఇవ్వకుండా, రాజధాని నిర్మాణం జరగకుండా మోసం చేస్తూనే వుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా స్పష్టమైన రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దిగజార్చారు.
- మితిమీరుతున్న నిర్బంధ చర్యలు
'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నారు పెద్దలు. నేటి దేశ, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు చూస్తుంటే 'వినాశకాలే అధికార నిర్బంధం' అనాల్సి వస్తుంది. అధికారం శాశ్వతమని భ్రమించి, చట్టాలను చుట్టాలుగా మార్చుకొని, నిర్బంధ విధానాలే తమ అధికార రక్షణ వలయంగా ఎంచుకొన్న పాలకులు తాము ప్రజాస్వామ్య దేశంలో ఏలికలమని మరచిపోతున్నారు. రాజ్యాంగ బద్ధంగా ప్రజలిచ్చిన అధికారంతో గద్దెపైనున్నామని మరచిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధపడకపోగా కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా ఉద్యమాలను, చట్టబద్ద నిరసనలను, పర్యటనలను బలవంతాన అణచివేస్తున్నది. సిపిఎస్ రద్దు హామీ అమలు కోసం ఉద్యమించిన ఉద్యోగులను, ఉపాధ్యాయులను పోలీసులు ఎలా అడ్డుకున్నారో, ఎలాంటి తప్పుడు కేసులు బనాయించారో చూశాము. అలాగే ప్రజా సంఘాలు ఏ పిలుపు ఇచ్చినా ముందస్తు అరెస్టులు అంటూ వేలాదిమందిని ముఖ్యంగా మహిళలను పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వచ్చినా ముందస్తుగా వామపక్ష, ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టు, గృహ నిర్బంధాలు చేయడం విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ నిర్బంధ చర్యలు అనుసరించడం వల్ల తమదే పైచేయి అయ్యిందనే భ్రమలో వైసిపి ప్రభుత్వం బతుకుతున్నది. ఈ నిర్బంధ విధానాలు అమలు చేసిన పార్టీకి అవి ఎంతటి ప్రమాదాన్ని తెస్తాయో చరిత్రలోనూ, వర్తమానంలోనూ అనేక అనుభవాలు వున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు ఈ నిర్బంధ విధానాలను తీవ్రతరం చేస్తున్నాయి. బలవంతాన కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయడం ప్రభుత్వాల విధానంగా మారింది. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక, కేంద్రం నుండి రావలసిన నిధులను సాధించలేని నిస్సహాయత నుండి ఈ నిర్బంధ విధానాలు మన రాష్ట్రంలో మరింత తీవ్రమవుతున్నాయి. తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి నేడు ఆ విలువల వలువలు ఊడదీస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల మాటలు సభ్యసమాజం తలదించుకునే విధంగా వుంటున్నాయి. మరికొందరు వీధి రౌడీలను తలపించేలా మాట్లాడుతున్నారు. ఈ వైఖరి వారికి తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు గాని దీర్ఘకాలంలో రాజకీయ పతనానికి దారి తీస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
- బిజెపి ప్రమాదాన్ని గుర్తించాలి
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు తరహా విధానాలు ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నాయి. హక్కుల ఉద్యమ నేతలను క్రూరంగా నిర్బంధంలో పెడుతున్నారు. న్యాయ వ్యవస్థను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. మతం, భాష పేరుతో దేశ ఐక్యతకు ప్రమాదం తెస్తున్నారు. గవర్నరు వ్యవస్థను, సిబిఐ, ఇ.డి లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. జాతి సంపదను, సహజ వనరులను తమ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు ఎలా దోచిపెడుతున్నారో చూస్తున్నాము. ఇలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో, ఏదో పేరుతో బలపడడానికి కాచుకొని వుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరుల వల్ల ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు విస్తరిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఈ ప్రమాదాన్ని నివారించాలి.
- విధానాల ప్రత్యామ్నాయం కావాలి
తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు, అది అనుసరించిన నిర్బంధ వైఖరుల వల్ల అనేక తరగతుల్లో అసంతృప్తి పెరిగి...చివరకు ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. నాటి విధానాల దుష్ఫలితాలను టిడిపి గుర్తించాలి. అప్పటికి, ఇప్పటికి అమలు తీవ్రతలో వున్న వ్యత్యాసాల బేరీజుకంటే అందులో వుండే ప్రమాదాన్ని అర్థంచేసుకోవాలి. ఆచరణలో అధిగమించాలి.
వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య చర్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. అందుకు ప్రజాఉద్యమం రావాలి. అయితే అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనే టిడిపి, జనసేన పార్టీల పిలుపు ఆచరణ సాధ్యమేనా? రాజధాని నిర్మాణంతో పాటు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వెనుకబడిన ప్రాంతాల అబివృద్ధి లాంటి అన్ని సమస్యలకు మూల కారణమైన బిజెపితో ఐక్యకార్యాచరణ ఎలా సాధ్యమవుతుంది? బిజెపి దేశవ్యాప్తంగా నిరంకుశ పాలన రుద్దుతోంది. మోడీని ఆదర్శంగా తీసుకొని జగన్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు. బిజెపి వత్తాసుతోనే ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు. దేశంలో అత్యంత అప్రజాస్వామికంగా పరిపాలిస్తూ ఒకవైపు కార్పొరేట్ అనుకూల వినాశకర ఆర్థిక విధానాలను, మరోవైపు మతతత్వ నియంతృత్వాన్ని క్రూరంగా అమలు చేస్తున్న బిజెపితో కలిసి ఏ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
విధానాల ప్రత్యామ్నాయం కాకుండా భావోద్వేగాల మీద ఆధారపడే కూటములు ప్రజా విశ్వాసాన్ని పొందలేవన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకే విధానాల ద్వారా ప్రజావిశ్వాసం పొందాలి. అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలను ప్రజా ఉద్యమం ద్వారా ప్రతిఘటించాలి.
/వ్యాసకర్త : వి. రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు