Jun 14,2023 22:28

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. కేసుల విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలిరోజు బుధవారం హైకోర్టులోని ఒకటో నెంబరు హాలు నుండి యాక్టింగ్‌ సిజె జస్టిస్‌ శేషసాయి, రఘునందనరావుతో కూడిన బెంచ్‌ విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలిరోజు మొత్తం 45 కేసులను విచారించారు. హైకోర్టు చరిత్రలో తొలిసారి కావడంతో న్యాయవాదులు, కక్షిదారులు కూడా ఆసక్తిగా తిలకించారు. ఇక నుంచి కేసుల విచారణను కక్షిదారులు నేరుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడటానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఒకటో కోర్టులో విచారణ ప్రసారం చేసినా క్రమంగా అన్ని కోర్టులకూ దీన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టులోనూ ప్రత్యక్షంగానూ, ఆన్‌లైన్‌ పద్ధతుల్లోనూ విచారణ సాగుతోంది. కేసుల విచారణ తీరు ప్రతి ఒక్కరికీ తెలియాలని, కోర్టుల్లో ఏం జరుగుతుందో ప్రజలు కూడా తెలుసుకోవాలని గతంలో సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులోనూ కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం జరిగింది. అదే సమయంలో దేశంలో ఉన్న అన్ని హైకోర్టుల్లోనూ ఇదే తరహా విచారణ జరగాలని సూచించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు.