Jul 13,2023 06:57

న్యూఢిల్లీ : మైనారిటీ ముస్లింలపై హిందూ మతోన్మాద శక్తులు మరోసారి విషం చిమ్మాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తల్కతొరా స్టేడియం ఇందుకు వేదికైంది. విహెచ్‌పీ నేత తొగాడియా సహా పలువురు నాయకులు ఆ స్టేడియంలో రెచ్చగొడుతూ ఉపన్యాసాలు చేశారు. 'మనం పారిపోకూడదు లేదా చనిపోకూడదు. మన కాలును వారి ఛాతిపై పెట్టి గుణపాఠం చెప్పాలి' అని వీహెచ్‌పీ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తొగాడియా విశ్వాసం ప్రకటించారు. రామమందిర నిర్మాణం జరుగుతోందని, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఒక రూపం సంతరించుకుంటోందని, లోక్‌సభ ఎన్నికలకు ముందే జనాభా నియంత్రణ బిల్లు కూడా సిద్ధమవుతుందని ఆయన తెలిపారు.
ఈ నెల 9న స్టేడియంలో అంతరక్షత్రియ హిందూ పరిషత్‌ ఏర్పాటుచేసిన విరాట్‌ హిందూ సమ్మేళన్‌లో కరడుకట్టిన హిందూత్వ వాదులు ప్రసంగిస్తూ ముస్లింలు జిహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. హిందువులు పోరాడితే జిహాదీ పరాజయం పాలవుతుందని చెప్పారు. అయితే మానవత్వం, క్షమాగుణం హిందువుల బలహీనతలని తెలిపారు. ఎవరైనా మన చెంప మీద కొడితే కొట్టిన చేతులు నరకాలని సమీక్షా సింగ్‌ పిలుపునిచ్చారు. ముస్లింలను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను పునర్నిర్మించాలన్నది వారి దురుద్దేశపూరిత లక్ష్యమని చెప్పారు. అయితే అఖండ హిందూ భారత్‌ ఏర్పాటు మన లక్ష్యమని హిందువులను ఉద్దేశించి అన్నారు.