బాణాసంచా కాల్పులతో దిగజారిన వైనం
న్యూఢిల్లీ : ఇప్పటికే కాలుష్య కోరల్లో ఉన్న ఢిల్లీ దీపావళి బాణాసంచా కాల్పులతో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా ప్రజలు బాణాసంచా పేల్చడంతో కాలుష్యం, పొగ కమ్మేశాయి. ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతాల్లో (ఎన్‌సిఆర్) సోమవారం ఉదయం పెరిగిన కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 6.00 గంటల సమయంలో ఢిల్లీ వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 500 కంటే అధికంగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో 900 కి చేరుకుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎక్యూఐ 910, కరోల్‌బాగ్‌లో 779గా నమోదయ్యాయి. గతవారం కురిసిన వర్షాలు కాలుష్యం నుండి కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ.. బాణాసంచాతో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. ఊపిరితిత్తులను ప్రమాదానికి గురిచేసే అతి సూక్ష్మ దూళికణాలుగా పేర్కొనే పిఎం 2.5 కణాల సాంద్రత 24 గంటల్లోనే 140 శాతం పెరిగింది.
ఆదివారం ఉదయానికి క్యూబిక్ మీటరుకు 83.5గా ఉండగా, ఈ ఉదయానికి అది 200.8కి చేరింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నిర్దేశించిన పరిమితి కంటే 30 రెట్లు ఎక్కువ అని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
అత్యంత కాలుష్య నగరాల్లో మరో రెండు నగరాలు
ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాను స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజాగా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, దీపావళి కారణంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాలు కూడా తీవ్ర వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి.
ఎక్యూఐ సూచిక 400 నుంచి 500 మధ్య నమోదైతే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. ఈ స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 150 నుంచి 200 మధ్య నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.