Nov 02,2023 11:51

ప్రజాశక్తి`అనంతపురం ప్రతినిధి :  రాష్ట్రంలో సాగుతున్నది కుర్చీల కోట్లాయే..తప్ప ప్రజా సమస్యలు అధికార వైసిపి, టిడిపిలకు పట్టడం లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ విమర్శించారు. దీనికి భిన్నంగా ప్రజా ప్రణాళికను అజెండాలోకి తీసుకొచ్చేందుక సిపిఎం ఈ యాత్రను చేపట్టిందని పేర్కొన్నారు. నవంబరు 15వ తేదిన విజయవాడలో జరిగే సభలో ప్రజా అజెండాను అందరి ముందుంచుతామని పేర్కొన్నారు. ప్రజారక్షణ భేరి యాత్ర గురువారం నాడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో జరిగింది. ఉదయం గుత్తిలో ప్రారంభమైన యాత్ర, పామిడి, అనంతపురం మీదుగా పెనుకొండ, హిందూపురం నుంచి రాత్రికి పుట్టపర్తికి చేరుకుంది. ఈ సందర్భంగా పలు చోట్ల యాత్ర బృందానికి స్వాగతం లభించింది. అనంతపురం నగరంలో టవర్‌క్లాక్‌ నుంచి బహిరంగ సభ జరిగిన నగర పాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన జరిగింది. వందలాది మంది ప్రజలు యాత్ర బృందానికి సంఫీుభావం తెలుపుతూ  ప్రదర్శన చేపట్టారు పెనుకొండ హిందూపురంలోనూ ఇదే రకమైన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలోనున్న వైసిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. విభజన హామీల అమలు చేయకుండా బిజెపి రాష్ట్రానికి ఏ రకంగా మోసం చేసిందో ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కనీసం సమీక్షలు జరుపుతున్న దాఖలాలు కూడా ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. కేవలం బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్నారని దుయ్యబట్టారు. అది కూడా రాష్ట్రం చేసిన అప్పులకు సంక్షేమానికి పెట్టిన ఖర్చులో భారీ వ్యత్యాసముందని పేర్కొన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు రూ.10 లక్షల కోట్లు అని తెలిపారు. ఇందులో సంక్షేమం కింద ఖర్చు చేసింది కేవలం రూ.2.50 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. తక్కిన డబ్బులు ఎక్కడికెళ్లాయో చెప్పాల్సిన అవసరముందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కుర్చి దిగితే తాము కూర్చీ ఎక్కాలన్న యోచన తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. ఇందుకోసమే ప్రజా సమస్యను ప్రధాన అజెండాగా ముందుకొచ్చేందుకు సిపిఎం ప్రజారక్షణ భేరీ యాత్రను చేపట్టిందని వివరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కరువు మండలాల ప్రకటనలోనూ ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించలేదని తెలిపారు. అన్ని మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులున్నా వాటిని ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు దయా రమాదేవి మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. వైసిపి, టిడిపి, జనసేనలు దానితో అంటగాగుతున్నాయని విమర్శించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీని వైసిపి అధికారంలోకి వచ్చాక విస్మరింంచిందని సిపిఎం రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు నాగవేణి, సీనియర్‌ నాయకులు జి.ఓబుళు తదితరులు పాల్గొన్నారు.

యాత్ర బృందానికి సమస్యలు ఏకరువు
ప్రజా రక్షణ యాత్ర సందర్భంగా అనంతపురం, సత్యసాయి జిల్లాలో జరుగుతున్న పర్యటనలో అనేక సమస్యలను బృందం దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఇచ్చిన వినతిపత్రాన్ని ఎపి మున్సిపల్‌ వర్కర్సు, అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు అందజేశారు. ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని భగత్‌సింగ్‌ ఆటో డ్రైవరు యూనియన్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. హమాలీ వర్కర్సుకు సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఇంకా నగరంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలివ్వాలన్న కోరుతూ ఇచ్చారు. ఇలా అనేక సమస్యలు బృందం దృష్టికి వచ్చాయి

 

**********************************************************************************

అనంతపురం

main

కర్నూలు ఆదోనిలో ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' బుధవారం అనంతపురానికి చేరుకుంది. ఈ సందర్బంగా అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ మాట్లాడుతున్నారు. (లైవ్‌)