ప్రజాశక్తి-రాజవొమ్మ్మంగి : తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సోమవారం అల్లూరి జిల్లా రంపచోడవరంలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ నల్ల చీరల ధరించి నిరసన ప్రదర్శన చేశారు. అంగన్వాడి నినాదాలతో రంపచోడవరం ఏజెన్సీ దద్దరిల్లింది. ఈ నెల 10న బ్లాక్ డే, 11 నిరసన తెలియజేయాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ కమిటీ పిలుపుమేరకు సోమవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ )రంపచోడవరం జిల్లాకమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు సీఐటీయూ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా బ్లాక్ డే నిర్వహించారు. తొలిత రంపచోడవరం పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం రంపచోడవరం ఎదురుగా జరిగిన బ్లాక్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు 4 ఏళ్ళు పూర్తి అయిన అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామని హామి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాట తప్పారన్నారు. సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చినప్పటికి అంగన్వాడీ కార్మికులకు గ్రాడ్యూటీ అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిఎ బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిందని తక్షణమే టిఎ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కోసం, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన 36 గంటలు నిరసన దీక్షను చూసైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ నిర్వీర్యం చేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారం కోసం భవిష్యత్తులో జరిగే ఐక్య ఉద్యమాలకు అందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, అంగన్వాడి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె రామలక్ష్మి, కె రాణి, కె వెంకటలక్మి, మండల నాయకులు రత్న కుమారి, బేబీరాణి, ప్రసున్న, సింగారమ్మ, నాగదేవి, సీహెచ్ కుమారి, రంపచోడవరం ఏడు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొన్నారు.










