Oct 17,2023 16:39
  • - సామాజిక తనిఖీలో వెలుగులోకి వచ్చిన  నకిలీ పింఛన్ల వ్యవహరం

ప్రజాశక్తి-మక్కువ(మన్యం) : ఏమండీ మీకు పెన్షన్‌ వస్తుందా.? వస్తుందండి. ఏం లోపంతో మీకు పెన్షన్‌ ఇచ్చారు? కాలు బాగోలేదు నాకు.. చెయ్యి బాగోలేదు నాకు అని చెప్పిన.. సమాధానానికి తనిఖీకి వెళ్లిన అధికారులకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. సదరంలో ఇచ్చిన ధ్రువపత్రంలో సదరు పింఛన్దారునికి  వినికిడి లోపుముగా ఉండడమే దీనికి కారణం.. కొంతమంది మహిళలకు భర్తలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళలుగా ధ్రువపత్రాలు జారీ చేస్తూ పెన్షన్లు అందించిన తీరును చూసి అధికారులు నివ్వెరపోయారు. వివరాల ప్రకారం.. మక్కువలోని ఎంపీడీవో కార్యాలయంలో పార్వతీపురం మన్యం జిల్లాడ్రామా పీడీ కే రామచందర్రావు అధ్యక్షతన మంగళవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, పనులతో పాటు వైయస్సార్‌ పెన్షన్‌లపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో తూరు మామిడి, కొయ్యన్నపేట, వెంకట బైరపురం గ్రామాల్లో నకిలీ వికలాంగ ధృవపత్రాలు పొందిన వారిని, భర్త ఉండి కూడా ఒంటరి మహిళ పెన్షన్లు పొందుతున్న వారిని అధికారులు గుర్తించారు. అలాగే ఉపాధిహామీ పనుల్లో కూడా మస్టర్లపై సంతకాలు, వేలిముద్రలు లేకుండానే బిల్లును చెల్లించిన అంశాలు మండలంలోని దబ్బగడ్డ, కదిరిపల్లి, కొయ్యన్నపేట, చెముడు పంచాయతీల్లో కూడా వెలుగు చూశాయి. స్థానిక ఫీల్డ్‌ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేయడం లేదని ఈ సందర్భంగా జడ్పిటిసి సభ్యులు ఎం శ్రీనివాసరావు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధి హామీలోనికి ఇరిగేషన్‌ కాలువలు ఇతర వ్యవసాయ ఆధారిత పనులను చేర్చాలని తద్వారా రైతులకు మేలు చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి శ్రీహరి, డిఆర్‌డిఓ పెన్షన్‌ ఏపీవో రత్నకుమారి, ఎంపీడీవో సూర్యనారాయణ, ఎస్‌ఆర్పిలు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.