Jul 12,2022 06:38
  • అంగన్వాడీలను కార్మికులుగా గుర్తిస్తూ భారత కార్మిక మహాసభ 2013లో తీర్మానం చేసింది. స్కీమ్‌లను ప్రైవేటీకరించరాదని, కార్మికులకు కనీస వేతనం, పెన్షన్‌, ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ఈ సిఫారసులను బుట్టదాఖలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారం కోసం నేడు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపడుతున్నాం.
మాతాశిశు మరణాలను తగ్గించాలని, పిల్లలను బడికి అలవాటు చేయాలనే లక్ష్యంతో 1975 అక్టోబర్‌ 2వ తేదీన ఐసిడిఎస్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నేటికీ 8 కోట్ల మంది పిల్లలు, 2 కోట్ల మంది గర్భిణీలు, బాలింతలకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. ఇంతటి కీలకమైన అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి భరోసా ఇవ్వాలి. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఐసిడిఎస్‌ కి బడ్జెట్‌ తగ్గిస్తోంది. కరోనా కాలంలో కూడా సరిపడా నిధులు కేటాయించలేదు. 2021-22కి కేవలం రూ.20,265 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. అంతేగాక ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయటానికిగాను... ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా...నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) తీసుకోస్తోంది.
దేశంలో నేటికీ పేదరికం తీవ్రంగా ఉంది. ఆకలి మరణాల సూచిలో 116 దేశాలలో మన దేశం 102వ స్ధానానికి దిగజారింది. డబ్ల్యుహెచ్‌ఓ వివరాల ప్రకారం భారతీయ శిశువులలో పోషకాహార లోపం అధికంగా ఉండటం వలన బాల్యంలో సాధారణంగా వచ్చే డయేరియా, న్యుమోనియా, మలేరియా వంటి అనారోగ్యాలకు కూడా శిశువులు బలి అవుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 25-49 సంవత్సరాల వయసు కలిగిన గర్భిణీలలో 52 శాతం మంది రక్తహీనతకి గురవుతున్నారని రిపోర్టులు చెప్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 48 నుండి 31 శాతానికి, పట్టణాల్లో 29 నుండి 19 శాతానికి తగ్గినా... పొరుగు దేశాలతో పోల్చితే మనం వెనకబడి ఉన్నాం. మన రాష్ట్రం లోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం, పట్టణాల్లో 19 శాతం నేటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐసిడిఎస్‌ ని మరింత బలోపేతం చేయాలి. బడ్జెట్‌ పెంచాలి.

  • అసలుకే ఎసరు

లబ్ధిదారులను తగ్గించడానికి అంగన్వాడి సెంటరులో పోషణ ట్రాకర్‌ యాప్‌ తీసుకొచ్చి లబ్ధిదారులకు ఆధార్‌ లింక్‌ చేస్తున్నారు. అంగన్వాడీలకు ఫోన్‌ ఇవ్వకుండా, నెట్‌ సౌకర్యం లేకుండా, నెట్‌ బ్యాలెన్స్‌ ఇవ్వకుండానే యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. లబ్ధిదారుల లిస్టు ఆధారంగానే రాబోయే కాలంలో అంగన్వాడీలకు వేతనాలు ఇస్తామని బెదిరిస్తున్నారు.
రాష్ట్రంలో 2017లో ఇచ్చిన సెల్‌ ఫోన్లు 95 శాతం చెడిపోయాయి. ఫిబ్రవరిలో యూనియన్‌ ఆందోళనకు పిలుపు ఇచ్చిన సందర్భంగా అంగన్వాడీలకు ఫోన్లు ఇస్తామని బడ్జెట్‌ కేటాయించామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు అదనంగా వైయస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకొని రెండు యాప్‌లలో పని చేయాలంటున్నారు.

  • రాష్ట్రంలో పెండింగ్‌ సమస్యలు

గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. 2021 నుండి తెలంగాణలో పిఆర్‌సి లో 30 శాతం వేతనాలు పెంచారు. ప్రస్తుతం అక్కడ వర్కర్‌కు రూ.13650, హెల్పర్‌కి రూ.7600 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అదనంగా వేతనాలు పెంచాలని అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. 60 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ హెల్పర్‌కి రూ.20,000, వర్కర్‌కి రూ.50 వేల రూపాయలు మాత్రమే రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం పెన్షన్‌ కూడా ఇవ్వకుండా రిటైర్‌ చేయడం వల్ల ఒంటరి మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల వలన నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పెంచినా అంగన్వాడీలకి పెంచలేదు. కనీసం వేతనంతో కూడిన మెడికల్‌ సౌకర్యం కూడా అమలు కావట్లేదు. కరోనా కాలంలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారికి కనీసం బీమా వర్తింపజేయట్లేదు.
ఏజెన్సీ, మారు మూల ప్రాంతాల్లో 5606 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వర్కరు పని, హెల్పరు పని చేయటం వలన మినీ వర్కర్లకి పని భారం పెరిగింది. వర్కర్‌తో సమానంగా వేతనం ఇవ్వటంలేదు. ప్రమోషన్లు ఇవ్వట్లేదు. మినీ వర్కర్లకు కూడా ప్రమోషన్‌ ఇవ్వాలని, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ అమలుకు అదనపు హెల్పర్‌ను కేటాయించాలని వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతున్నాం.
అంగన్వాడి వర్కరు పోస్టు ఖాళీ అయినప్పుడు హెల్పరుకు క్వాలిఫికేషన్‌ ఉంటే ప్రమోషన్‌ ఇవ్వాలని జీవో ఉంది. కానీ జీవో అమలు చేయడంలేదు. రాజకీయ జోక్యం పెరిగిపోయి గుంటూరు, పల్నాడు, ప్రకాశం, విజయనగరం అనంతపురం, కర్నూలు...అనేక జిల్లాల్లో అర్హులైన హెల్పర్లకి ప్రమోషన్‌ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే నుండి లెటర్లు తెచ్చుకోవాలని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామం, మున్సిపాలిటీని యూనిట్‌గా తీసుకొని ప్రమోషన్‌ ఇవ్వాలని కోరుతున్నాము.

  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ

గుజరాత్‌లో రిటైర్‌ అయిన ఐదుగురు అంగన్వాడీలు... పదవీ విరమణ సదుపాయమైన గ్రాట్యూటీని వర్తింపజేయాలని కోర్టులో కేసు వేశారు. అనేక మలుపుల అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. 2022 ఏప్రిల్‌ 25న సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. అంగన్వాడీలు చేస్తున్న అనేక సేవలను ప్రశంసిస్తూ అంగన్వాడీలు కార్మికులేనని... గ్రాట్యూటీకి అర్హులేనని...దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వ్యతిరేక విధానాలు మానుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలి.

  • పెరిగిన నిర్బంధం

అంగన్వాడీ పోరాటాల మీద ఇటీవలి కాలంలో నిర్బంధం పెరిగింది. వై.యస్‌.జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని...రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగిన ఆందోళనలో పోలీస్‌ నిర్బంధం తీవ్ర స్థాయిలో ఉంది. ఇళ్లకు పోలీసులను పంపి మహిళలను అవమానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కనీసం రిలే దీక్షలకు కూడా పర్మిషన్‌ ఇవ్వలేదు.

  • పోరుబాటలో భాగంగా కోర్కెల దినం

ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్‌ఇపి ని ఏ రాష్ట ప్రభుత్వాలూ అమలు చేయటం లేదు. మొట్టమొదటిగా మన రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయటానికి 172 సర్క్యులర్‌ తీసుకొచ్చింది. రాబోయే కాలంలో అంగన్వాడీ సెంటర్‌ని ఎలిమెంటరీ స్కూళ్లలో విలీనం చేయాలని నిర్ణయం చేస్తున్నారు. పిపి1, పిపి2, ఎలిమెంటరీ స్కూల్లోని 1, 2 తరగతులు కలిపి ఫౌండేషన్‌ స్కూల్‌గా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల అంగన్వాడీ సెంటర్లు కుదించబడతాయి. లబ్ధిదారులకు సెంటర్‌ దూరమవ్వటం వల్ల గర్భిణీలు, బాలింతలు సెంటరుకు రావడం తగ్గిపోతుంది. క్రమేణా అంగన్వాడి సెంటర్లే ప్రశ్నార్ధకంగా తయారవుతాయి.
భారత కార్మిక మహాసభ 2013లో అంగన్వాడీలను కార్మికులుగా గుర్తిస్తూ తీర్మానం చేసింది. స్కీమ్‌లను ప్రైవేటీకరించరాదని, కార్మికులకు కనీస వేతనం, పెన్షన్‌, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ఈ సిఫారసులను బుట్టదాఖలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారం కోసం జులై 12వ తేదీన ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపడుతున్నాం.

  • డిమాండ్లు ఇవీ...
  1. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి.
  2. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చెయ్యాలి.
  3. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. నెలకు ఒక గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చెయ్యాలి. రెండు నెలల బిల్లులు ముందుగా అడ్వాన్స్‌ ఇవ్వాలి.
  4. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలి.
  5. అంగన్వాడీలకు రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.
  6. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి.
  7. అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం ఆపాలి.
  8. 400 జనాభా దాటిన మినీలను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. మినీ వర్కర్లకు మెయిన్‌ వర్కర్‌తో సమానంగా వేతనం ఇవ్వాలి. ప్రమోషన్లు ఇవ్వాలి.
  9. హెల్పర్ల ప్రమోషన్‌లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. హెల్పర్ల ప్రమోషన్‌ లకు వయో పరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలి.
  10. అంగన్వాడీ వర్కరు, హెల్పరు చనిపోయినచో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బీమా వర్తింపచేయాలి.
  11. వేతనంతో కూడిన మెడికల్‌ లీవు సౌకర్యాలు కల్పించాలి.
  12. గ్రేడ్‌ 2 సూపర్‌ వైజర్‌ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న వర్కర్‌, హెల్పర్‌ పోస్టులను భర్తీ చెయ్యాలి.


- సుబ్బరావమ్మ, ఎ.పి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి