Nov 21,2023 10:51

ఐసిడిఎస్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల నిరసనలు
ప్రజాశక్తి- యంత్రాంగం : 
  ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఐసిడిఎస్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా ఐసిడిఎస్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. తమ సమస్యలను డిసెంబర్‌ ఎనిమిదిలోపు పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అనంతరం సిడిపిఒలకు వినతిపత్రాలు అందజేశారు. సిఐటియు, ఐఎఫ్‌టియు, అంగన్‌వాడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు.

తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలో ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన దీక్షలను ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ సెంటర్లకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కోరారు. ఫేస్‌యాప్‌ను రద్దు చేయాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ హిమాన్షుశుక్లాకు వినతిపత్రం అందించారు. కొత్తపేటలో నిర్వహించిన దీక్షలకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మద్దతు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన దీక్షలు నిర్వహించారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని సిడిపిఒ కార్యాలయాల వద్ద ఒక రోజు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. అనంతరం ఆయా సిడిపిఒలకు వినతిపత్రాలు అందజేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ, అనంతగిరిలో ధర్నా చేపట్టారు. ముంచంగిపుట్టులో ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటుచేశారు. చింతపల్లిలో నిరాహార దీక్ష చేపట్టారు. కొయ్యూరు మండల కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, కశింకోట, యలమంచిలి కేంద్రాల్లోని ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. చిత్తూరు, పుత్తూరు, నాయుడుపేట ఐసిడిసి కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్‌ ఎనిమిది నుంచి నిరవధివక సమ్మె చేయనున్నట్లు కర్నూలు ఐసిడిఎస్‌ పిడి, సిడిపిఒకు అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. ఆస్పరి సచివాలయం దగ్గర నిరసన చేపట్టారు. ఆదోని, ఎమ్మిగనూరులో సిడిపిఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సత్యసాయి జిల్లా, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో ఐసిడిఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, సిడిపిఒలకు వినతిపత్రాలు అందజేశారు.