Oct 18,2023 18:02

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు శరణ్యమని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మంగళగిరి సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీల సమస్యలపై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మంగళగిరి ప్రాజెక్టు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హేమలత అధ్యక్ష వహించారు. సుబ్బరావమ్మ తన ప్రసంగానికి కొనసాగిస్తూ అంగన్వాడీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనపు వేతనం ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. కనీసం నాలుగున్నర సంవత్సరాలలో అంగన్వాడీల సమస్యలు పై ఒక అర్జీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా టిఏ అలవెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వేతనాలు కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. సంవత్సరానికి రెండు నెలలు వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీలే కొన్ని సెంటర్లను సొంత డబ్బులతో నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయడం లేదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడి సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటుపరం చేసి ఇబ్బందులు గురి చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ సెంటర్లను విలీనాల పేరుతో మూసి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేయడం వలన కొంతవరకు మానుకోవడం జరిగిందని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధక్షులు వై నేతాజీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు సంఘటనగా ఉండి ఆందోళన తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఆందోళన చేసిన ఫలితంగా అంగన్వాడీలు గ్రాడ్యుటిని సాధించడం జరిగిందని అన్నారు. మంగళగిరి ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు వేముల దుర్గారావు మాట్లాడుతూ అంగన్వాడీలను అనేక విధాలుగా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుందని విమర్శించారు. ఇలాంటి తరుణంలో తమ సమస్యలు పరిష్కారానికి ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇంకా ఈ సదస్సులో సిఐటియు మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్, అంగన్వాడి యూనియన్ నాయకులు సరళ, మధులత, కోటేశ్వరి, కిరణ్మయి, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.