- వేలాది మంది అరెస్ట్
- కళ్యాణ మండపాలు, ఏఆర్ గ్రౌండ్స్, పోలీస్ స్టేషన్లకు తరలింపు
- మద్దతుగా సిపిఎం రాస్తారోకో
- రాష్ట్ర కార్యదర్శితో సహా పలువురిఅరెస్టు.. అక్రమ కేసులు
- వామపక్ష పార్టీల ఖండన
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ ఆదేశాలతో రెండు రోజుల నుండే నోటీసులు, హౌస్ అరెస్ట్‌ల వంటి చర్యలను చేపట్టిన పోలీసులు సోమవారం రోజు విజయవాడ నగరమంతా మొహరించారు. సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన మహాధర్నాకు తరలివస్తున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్‌లతో పాటు నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లోనూ పోలీసుల నిఘా కనిపించింది. అయినా, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్(ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్‌టియు) ఆధ్వర్యాన అడ్డంకులను అధిగమించి వేలాదిమంది అంగన్‌వాడీలు విజయవాడకు చేరుకున్నారు. విడివిడిగా, బృందాలుగా, చిన్న ప్రదర్శనలుగా ధర్నా చౌక్‌కు తరలివెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని ఎక్కడివారిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే 3,500 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లు, కళ్యాణమండలపాల్లో నిర్బంధించారు. వీరికి మద్దతుగా సిపిఎం రాస్తారోకో చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
నిర్బంధాన్ని అధిగమించి...
అంతకుముందు నిర్బంధాన్ని అధిగమించి వివిధ మార్గాల్లో విజయవాడ ధర్నా చౌక్‌కు వెళ్లేందుకు అంగన్‌వాడీలు ప్రయత్నించారు. రెండు రోజుల నుండి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా వేలాదిమంది విజయవాడ వీధుల్లో ప్రత్యక్షం కావడం పోలీస్ అధికారులను సైతం విస్మయపరిచింది. దీంతో ఆర్‌టిసి బస్టాండు, రైల్వే స్టేషన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బీసెంట్ రోడ్డు, సిఆర్‌డిఎ కార్యాలయం, అలంకార్ సెంటర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కనిపించిన కనిపించినట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానం వచ్చిన సామాన్య ప్రజలను కూడా జీపులు, వ్యాన్‌లు ఎక్కించడంతో పలు ప్రాంతాల్లో వాగ్వివాదం చోటుచేసుకుంది. దుర్గ గుడికి, ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని కూడా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను తప్పించుకుని వందలాది మంది ఒక్కసారిగా ఏలూరురోడ్డు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు చొచ్చుకువచ్చారు. వీరిని అతి కష్టంమీద ధర్నా చౌక్‌కు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) నాయకులు సుబ్బరావమ్మ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, బేబీరాణి, ఎన్‌సిహెచ్ సుప్రజ, సీనియర్ నాయకులు రోజా తదితరులు ఏలూరు రోడ్డుపై బైఠాయించారు. వీరిని కూడా పోలీసులు ఈడ్చిపడేశారు. అనంతరం ఐఎఫ్‌టియు అనుబంధ సంఘం నాయకులు కూడా రోడ్డుపైకి దూసుకొచ్చారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
పోలీసుల దురుసు ప్రవర్తన
రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు ఈడ్చుకుంటూవెళ్లి ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, పోలీసు వాహనాల్లో వేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలోనే మహిళా పోలీసులు అంగన్‌వాడీలపట్ల దురుసుగా ప్రవర్తించారు. బస్సుల డోర్లు, ఆటోలకు తలలను మోదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తల మొఖంపై మహిళా పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. ఈ దెబ్బలకు తాళలేక అంగన్‌వాడీ కార్యకర్త ఒకరు సొమ్ముసిల్లి పడిపోయారు. ఈ ఘటనలను చిత్రీకరిస్తున్న ఐఎఫ్‌టియు చిత్తూరు జిల్లా నాయకుడి నుండి సెల్‌ఫోన్ లాక్కుని ఓ ఐపిఎస్ అధికారి అటుగా వస్తున్న బస్సు చక్రాల కింద పడేసి ధ్వంసం చేశారు. అరెస్ట్ అయిన వారిని ఎఆర్ గ్రౌండ్స్, ఆటోనగర్ మొబైల్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు, భవానీపురం పోలీసుస్టేషన్, సింగ్‌నగర్ వడ్డెరకాలనీ కళ్యాణమండపం, కండ్రిక కమ్యూనిటీ హాలు, నక్షత్ర కళ్యాణమండపాలకు తరలించారు. పోలీసుల తోపులాటలో అనంతపురం జిల్లా నాయకులు శకుంతల మోకాలికి దెబ్బతగడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. అరెస్టుల క్రమంలో సుమారు రెండుగంటలపాటు ఏలూరురోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టయిన వారిలో ఎఐటియుసి నాయకులు ఓబులేసు, లలితమ్మ, ఐఎఫ్‌టియు నాయకులు పొలారి తదితరులు ఉన్నారు.
సిపిఎం రాస్తారోకో
అంగన్‌వాడీలపై మోపిన నిర్బంధానికి నిరసనగా సిపిఎం రాస్తారోకోకు దిగింది. ఎక్కడికక్కడ జరుగుతున్న అరెస్ట్‌లు, ధర్నా చౌక్ వద్దకు వెళ్లనీయకపోవడం, సమస్యలను చెప్పుకునే కనీస అవకాశం కూడా ఇవ్వకుండా పోవడం తదితర అంశాల పట్ల సిపిఎం నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర కార్యాలయంలో ఉన్న నాయకులు అప్పటికప్పుడు నిరసన తెలపాలని నిర్ణయంచారు. అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతు ఇస్తూ రాస్తారోకో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇద్దరు అదనపు డిసిపిలు, ముగ్గురు ఎసిపిలు, నలుగురు సిఐలు వందలాదిమంది పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది నాయకులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పెద్దఎత్తున ఉద్రిక్తత నెలకొంది. నాయకులు వారిని నెట్టుకుని ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్వల్పతోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరశిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, బాబూరావు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన కార్యకర్తలను నెట్టేశారు. వి.శ్రీనివాసరావుతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సిహెచ్.బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము, సిపిఎం నగర నాయకులు రమణ, శ్రీనివాసు, కమల తదితరులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తరలించారు.
బాధ్యతగల రాజకీయ పార్టీగా మద్దతు : వి. శ్రీనివాసరావు
అంతకుముందు సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. బాధ్యతగల రాజకీయ పార్టీగా అంగన్‌వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం వారిపై ప్రయోగించిన నిర్బంధాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అంగన్‌వాడీలు కోరుతున్నారని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కన్నా అదనంగా రూ. వెయ్యి వేతనం ఇస్తామని జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీలను అమలు చేయాలని కోరుతూ విజయవాడ వచ్చిన వేలమందిని, మహిళలని కూడా చూడకుండా ఎక్కడికక్కడ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అమానుషంగా అరెస్టులు చేశారన్నారు. మహిళలు కనిపిస్తే చాలు అంగన్‌వాడీలా కాదా అన్న దానితో నిమిత్తం లేకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. విజయవాడ వచ్చిన అంగన్‌వాడీల ఉద్యోగాలను పీకేస్తామని మరోపక్క బెదిరిస్తున్నారన్నారు. 'అంగన్‌వాడీల ఉద్యోగాలు పీకేస్తే వారు మీ అధికారాన్ని త్వరలోనే పీకేస్తారు... పాలకులు ఇది గుర్తించాలి' అని ఆయన హెచ్చరించారు. అంగన్‌వాడీలను వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం తీవ్రమైన నేరం అన్నారు. దీన్ని సిపిఎం అంగీకరించదన్నారు. ఈ అమానుష ఘటనకు నిరసన తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకుని కళ్యాణ మండపాలను జైళ్లగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహిస్తున్న నిరసనలను అణచివేయడం సరికాదన్నారు.
వామపక్ష పార్టీల ఖండన
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన వేలాదిమంది అంగన్‌వాడీలను, వారిపై నిర్భంధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ట్రేడ్ యూనియన్, సిపిఎం నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు, ఎ.వి.నాగేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు జి.ఓబులేసు, ఆర్.రవీంద్రనాథ్, ఐఎఫ్‌టియు నాయకులు పి.ప్రసాద్, పోలారి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వీరితోపాటు గన్నవరం, రాజమండ్రి, చిత్తూరు, అనంతపురం, తదితర జిల్లాల్లో అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . తమ న్యాయమైన కోర్కెల సాధనకు విజయవాడలో అంగన్వాడీలు ధర్నా చేయాలని నిర్ణయించారని, ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ధర్నాకు వచ్చిన మహిళలను ఎక్కడికక్కడ బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో జల్లెడపట్టి అరెస్టు చేయడం గర్హనీయమన్నారు.
అరెస్టయిన నేతలకు పలువురు పరామర్శ
పోలీసులు అరెస్టు చేసిన అంగన్‌వాడీ, ట్రేడ్ యూనియన్, సిపిఎం కార్యకర్తలు, నాయకులను పలువురు పరామర్శించారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాద్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జి, ప్రొఫెషనల్ ఫోరం నాయకులు నేతి మహేశ్వరరావు తదితరులు పరామర్శించారు. అరెస్టులను టిడిపి అనుబంధ అంగన్‌వాడీ సంఘ నాయకులు ఆచంట సునీత ఖండించారు. ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర నాయకులు సుందరయ్య, అయ్యప్పరెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, నాగభూషణం తదితరులు కూడా అరెస్ట్‌లను ఖండించారు.