న్యూఢిల్లీ : రెబల్ నేత అజిత్ పవార్ తిరుగుబాటుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో శరద్ పవార్ వర్గం మద్దతుదారులు అజిత్ పవార్‌కి వ్యతిరేకంగా పోస్టర్లతో దాడికి దిగారు. గురువారం న్యూఢిల్లీలోని ఎన్‌సిపి కార్యాలయం ఎదుట బాహుబలి సినిమాలోని కొత్త పోస్టర్లు వెలిశాయి. శరద్ పవార్, అజిత్ పవార్, ప్రపుల్ పటేల్‌లతో కలిసి ఉన్న పోస్టర్ స్థానంలో ''బాహుబలి - ది బిగినింగ్'' సినిమాలోని కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచే సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్‌సిపికి చెందిన విద్యార్థి విభాగం 'రాష్ట్రవాడి విద్యార్థి కాంగ్రెస్' ఆ పోస్టర్‌పై అజిత్ పవార్‌నుద్దేశించి 'విశ్వాసఘాతకుడు' అని పేర్కొనడం గమనార్హం. 'వాస్తవానికి, అబద్ధానికి మధ్య యుద్ధం, దేశ ప్రజలంతా శరద్ పవార్‌తోనే ' అని మరో పోస్టర్‌లో రాశారు.










