Nov 19,2023 09:13

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ఈ నెల 19న ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆర్ట్‌ ప్యారడైజ్‌ చిత్రకళా ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్లు ఆయా సంఘాల బాధ్యులు స్ఫూర్తి శ్రీనివాస్‌, గుండు నారాయణరావు తెలిపారు. బాలోత్సవ్‌ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్‌, నారాయణ మాట్లాడుతూ.. చిత్ర కళ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడంతోపాటు చిత్ర కళలో వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.
            ఆంధ్రా అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ కార్యదర్శి ఎంబి.సాయిబాబు 40 మంది విద్యార్థులతో చిత్రకళా ప్రదర్శనను ప్రారంభిస్తారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం వివిధ కేటగిరీల విద్యార్థులకు చిత్ర కళాప్రపూర్ణ నడిపల్లి సంజీవరావు స్మారక చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అలకనంద రివర్‌ ఫ్రంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ ఎ.వి.ఆర్‌.చౌదరితోపాటు పెనమలూరు జడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యలమంచి దుర్గాభవానీ, మనీషా డెంటల్‌ క్లినిక్‌ అధినేత డాక్టర్‌ కె.లక్ష్మీ సమీర పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో గిరిధర్‌ అరసవిల్లి, సంధ్యారాణి పాల్గొన్నారు.