Jul 16,2023 10:55

ప్రజాశక్తి-పత్తికొండ (కర్నూలు) : రాష్ట్రంలో బడుగు జీవ అభ్యున్నతి కోసం, అన్నదాతల బాగుకై నూతన పార్టీని ఆవిర్భవించాలన్న ధ్యేయంగా, రాష్ట్రములో ప్రజలకు బంగారు భవితను అందించాలన్న దిశగా నూతన పార్టీ ఆవిర్భవింపజేస్తున్నట్లు రాచ కౌలుట్లయ్య యాదవ్‌ తెలిపారు.

ఆదివారం స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి రాజా నరేష్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో, బోడే రామచంద్ర యాదవ్‌ నేతఅత్వంలో ఆవిష్కరింపబోతున్న రాష్ట్ర నూతన పార్టీ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌలుట్లయ్య యాదవ్‌ మాట్లాడుతూ ... రాష్ట్రములో అరాచక పాలన సాగుతుందని బడుగు జీవులు భుక్తి కోసమై ఇతర రాష్ట్రాల పంచన చేరాల్సి వస్తుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడి నేతలపై బడుగు బలహీనవర్గాలు తిరగబడితే తప్ప రాష్ట్ర ప్రజల భవితకు భద్రత లేదన్నారు. రాష్ట్ర ప్రజల బంగారు భవితకు బాటలు వేయాలంటే నూతన శకం ఆరంభం కావలసిందేనన్నారు. ఈ నూతన శక ఆరంభోత్సవానికి రాష్ట్రంలో డైనమిక్‌ వంటి లీడర్‌ తయారయ్యాడని ఆయనే బోడి రామచంద్ర యాదవ్‌ అన్నారు. ఆయన నేతఅత్వంలో రాష్ట్రంలో నూతన పార్టీ ఆవిష్కరించబడబోతుందన్నారు. ఈ నూతన శఖ అధ్యాయానికి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలంతా ఏకం కావాలన్నారు. బడుగులు గొడుగులు పట్టే రోజులు పోయాయని, పల్లకి ఎక్కి కూర్చుని ఊరేగే రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు. అగ్రవర్ణ పాలనకు చరమగీతం పాడి బడుగుల రాజ్యానికి నాంది పలకాలన్నారు. బడుగు జీవుల బాగు కోసం అన్నదాతల భరోసా కోసం, ఆడపడుచుల భద్రత కోసం, యువతకు బంగారు భవిత కోసం, అరాచక పాలనపై పోరుబాటను సాగించాలన్నారు. దోపిడి నేతలపై తిరుగుబాటు చేసేందుకు బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రామచంద్ర యాదవ్‌ పార్టీని స్థాపించబోతున్నారన్నారు. ఐక్యతే ఆయుధంగా అగ్ర వర్ణాలపై పోరుబాటకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే ఈనెల 23వ తేదీన గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం దగ్గరలో ప్రజా చైతన్య వేదికను ఏర్పాటు చేశారన్నారు. ఈ భారీ ప్రజా సింహ గర్జన బహిరంగ సభకు ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఉరుకుందు యాదవ్‌, కోటేశ్వర యాదవ్‌, మహేష్‌ యాదవ్‌, రాజేష్‌ యాదవ్‌, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు