ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మోడీ దుష్పరిపాలన నుండి రైతులను శ్రామికులను కాపాడాలని జులై 30 ఆదివారం నిర్వహించనున్న విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో కార్మిక కర్షక రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో వైఎస్‌ఆర్ సర్కిల్ యందు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అనంతరం రైతు సంఘం మండల కార్యదర్శి వెంకట చౌదరి ఉపాధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ ... భారత వ్యవసాయానికి రైతాంగానికి తీవ్రమైన హాని కలిగించే మూడు నల్ల చట్టాలను ఎలక్ట్రిసిటీ బిల్ 2020ని రద్దు చేయాలని పంటలన్నింటికీ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా సమగ్ర పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి చట్టబద్ద ఎం ఎస్ పి నిర్ణయించబడాలని రైతులకు ఒక్క పర్యాయం పంట రుణాలను మాఫీ చేయాలనే డిమాండ్లతో అనేక ఒడిదుడులను ఎదుర్కొంటూ దేశవ్యాప్తంగా 500 పైగా రైతు సంఘాలతో ఏర్పడ్డ సభ్యత కిసాన్ మోర్చా నేతఅత్వంలో సంవత్సరం పైగా పోరాటాన్ని సాగించామన్నారు. అయినప్పటికీ లెక్కచేయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కొద్ది సమయం ముందు దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని రైతులతో చర్చించిన తర్వాతే పార్లమెంటులో ఎలక్ట్రిసిటీ బిల్లులు ప్రవేశపెడతామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పటికి కూడా అమలు చేయలేదన్నారు. పార్లమెంటులో ఎలక్ట్రిసిటీ బిల్లును ప్రవేశపెట్టడమే కాక రైతాంగం మెడలకు ఉరితాడు కాగల ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ల బిగింపును వేగవంతం చేస్తున్నారని, అందువలననే రైతులు తమ డిమాండ్లను సాధించుకునేందుకు తిరిగి పోరాటం సాగించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకుందని వివరించారు.