Oct 24,2020 18:32

ఇతనొక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌. కానీ అసాధారణమైన పనికి పూనుకున్నాడు. గత పాతికేళ్లుగా తన రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని పేద ప్రజలకు సేవ చేయడానికే కేటాయించాడు. అవసరమైన వారికి, ప్రాణాలు కాపాడే ఆపరేషన్లకు, పేదలకు ఇంటి నిర్మాణాల వంటి పెద్ద పనుల్లోనూ అండగా నిలబడ్డాడు. నిస్వార్థ సేవకు అర్థంగా మారాడు.

'నేను ధనవంతుణ్ణి కాదు. కానీ నేను అందించే డబ్బంతా నా చుట్టుపక్కలున్నవారి ఔదార్యమే!' అనే 63 ఏళ్ల వర్గీస్‌ జోసఫ్‌ తొంపిలెతు వృత్తిపరంగా ఒక సామాన్య ట్యాక్సీ డ్రైవర్‌. అంతా 'రెజీ' అని పిలుచుకునే ఈయన కనీస జీవన పరిమాణాలనూ అందుకోలేని అత్యంత పేదలకు పెద్దదిక్కు. తలదాచుకునేందుకు ఇల్లు, తినడానికి తిండి, వైద్య సహాయం సమకూర్చడమే ఈయన ప్రవృత్తిగా మార్చున్నారు. బడుగు వర్గాల ప్రజలకు 25 సంవత్సరాల్లో 27 గృహాలు నిర్మించడానికి సహాయపడటంతో పాటు వారి పిల్లలకు విద్యను అందించడంలో సొంత మనిషిలా తోడున్నారు.
సామాన్య నేపథ్యం
రెజీ పుట్టిపెరిగింది కేరళ, చెంగన్నూర్‌లోని చెరియానాడ్‌కు చెందిన అతి సామాన్య కుటుంబంలోనే. పాఠశాల విద్య అనంతరం ట్యాక్సీడ్రైవర్‌ అవ్వాల్సి వచ్చింది. అయినంత మాత్రాన ఆయన చేయాలనుకున్న సేవకు అదేమీ అడ్డుగా రాలేదు. భారతదేశంలోనే కాకుండా విదేశాల నుంచీ ఆయన సేవను గుర్తించిన వ్యక్తులున్నారు. ప్రారంభంలో ప్రయివేటు వాహనాలను నడుపుతూ కొన్నేళ్లకు సొంత కారు కొనుకున్నా, ఇంటి ఆర్థికస్థితి బాగోక కొన్నాళ్లకు ఆ కారును అమ్ముకోవాల్సి వచ్చింది. మళ్లీ ఇతరుల కారుకి డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. కారులో ఆయా ప్రదేశాలు తిరిగే రెజీ తరచుగా సగంలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాలు, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు చూస్తుండేవారు. ఖాళీ సమయంలో వారి దగ్గరికి వెళ్లి వారికలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో కనుక్కునేవారు. వారి అవసరాన్ని అర్థంచేసుకొని, చేయగలిగిన సాయం అందించేవారు. మొదట్లో తన దగ్గరున్నదే నలుగురికీ పంచిన ఇతను తర్వాత స్నేహితుల సహాయంతో ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించారు.
ఇల్లు ఓ కూలీది!
రెజీ సహాయం చేసిన మొదటి ఇల్లు రాజేంద్రన్‌ అనే వ్యక్తిది. ఇతను రోజువారీ కూలి. భార్య, ఇద్దరి పిల్లలతో 35 ఏళ్లుగా చిన్న పూరి గుడిసెలో నివశించేది ఆ కుటుంబం. తన కుమార్తెకు నడుము నుంచి కింద దేహం పనిచేయదు. ఈ పరిస్థితుల్లో రాజేంద్రన్‌ సంపాదనలో అధికభాగం కుమార్తె వైద్యానికే సరిపోయేది. అందుకే ఈ కుటుంబం కోసం రెజీ ఒక సంస్థను ఆశ్రయించారు. అయితే అవసరమైనంత డబ్బు సమకూరలేదు. అలాంటి సమయంలోనే ఆ టౌన్‌లో ఫేమస్‌ బట్టల కొట్టు యజమాని సుదీష్‌ వెలైవీడన్‌ అనే వ్యక్తి రెజీని సంప్రదించారు. రాజేంద్రన్‌ ఇంటి నిర్మాణానికయ్యే పూర్తి ఖర్చును తను భరిస్తానన్నారు. అది మొదలు ఇప్పటికి 27 ఇళ్ల నిర్మాణాలకు రెజీ ఎంతో సహాయం అందించారు.
ఆమెకు అండగా...
రెజీ చేస్తున్న పనిని తెలుసుకున్న వారంతా వారివారి ప్రాంతాల్లో పేదరికంతో ఇబ్బందిపడుతున్న వారి కథలు రెజీకి చెబుతుండేవారు. అలాంటి వాటిలో 16 ఏళ్ల సౌమ్య కథ ఒకటి. ఆమె రెండు కిడ్నీలు పాడైన పరిస్థితి. కిడ్నీ మార్పిడి వైద్యం చేయించుకునే స్థోమత ఆ కుటుంబానికి లేదు. డయాలసిస్‌ కోసం అప్పటికే అప్పులపాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రెజీ ఆ ప్రాంతంలోని 12 పాఠశాలలను సంప్రదించారు. అందరి సహాయంతో రూ. 6,20,000 లను సేకరించి, సాయపడ్డారు. కొట్టాయం మెడికల్‌ కాలేజీ వారితో మాట్లాడి, రోడ్డు ప్రమాదానికి గురైన సౌమ్య బ్లడ్‌ గ్రూప్‌తో సరిపోయే వ్యక్తి ద్వారా ఆమె ప్రాణాన్ని నిలబట్టగలిగారు. ఇప్పుడు సౌమ్య హరిప్పడ్‌లోని వాటర్‌ అథారిటీ డిపార్ట్‌మెంట్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.

కుటుంబమే బలం

రెజీ ఇంత మందికి సహాయం చేయడంలో ఎలాంటి అడ్డంకీ లేకపోవడానికి కారణం ఆయన సేకరించే, ప్రతి పైసాను దుర్వినియోగం చేయకపోవడమే. అంతేకాదు తాను సహాయం చేసిన ప్రతివారితోనూ ఇప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారి అభివృద్ధిని తలచుకొని ఎంతో సంతోషిస్తారు. వారి ఆశీర్వాదాలే తన కుటుంబ ఆనందానికి కారణమని చెబుతుంటారు రెజీ. గృహిణి అయిన తన భార్య ఎలిజిబెత్‌, మొబైల్‌ టెక్నీషియన్‌ అయిన కుమారుడు సెబస్టియన్‌ సహకారమే తాను సంతృప్తిగా సేవ చేయడానికి కారణమని అంటారు. ఈ కరోనా లాక్‌డౌన్‌లోనూ రెజీ కొన్ని కుటుంబాలకు నెలకు ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఇలాంటి నిస్వార్థ సేవను అందించే వారే ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటారు.

spoorty