- ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య
ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : విశాఖ జిల్లాలో ఆటోలపై వేసిన ఇ - చలానాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ వివిధ అక్రమ పద్దతుల్లో ఇ - చలానాలను ప్రభుత్వం వేసిందని, స్వయం ఉపాధితో బతుకుతున్న ఆటో డ్రైవర్లపై ఈ రకమైన దాడులు అన్యాయమన్నారు. పార్కింగ్ స్థలాలు లేకుండా నాన్ పార్కింగ్ పేరుతో వేసిన ఈ చలానాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జివిఎంసి కమిషనర్ జోక్యం చేసుకొని పార్కింగ్ స్థలాలు కేటాయించాలని కోరారు. విశాఖ నగరంలో దాదాపుగా 60 వేల మంది ఆటో ఆధారంగా జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. సరుకులు తెచ్చుకునేందుకు , ప్రయాణికులు ఆపారని రోడ్డు పక్కకి ఆటో ఆపినా ఫొటోలు తీసి ఇ - చలానాలను పంపిస్తుండడం, ఆయా కేసులకు సంబంధించి డబ్బులు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే డీజిల్, స్పేర్ పార్టుల ధరలు, స్కూలు ఫీజులు, ఆర్‌టిఒ ఫైన్‌లు, వీటికి తోడు ఇ - చలానాలతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకుని చలానాలను రద్దు చేయాలని కోరారు. 2021లో జిల్లా కలెక్టర్ ఇ చలానా రద్దుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే ఇ చలానాలను రద్దు చేశారని తెలిపారు. రాష్ట్రంలోనూ ఇ చలానా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్, మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి అప్పలరాజు, ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.