Jan 08,2021 21:01

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 7.18 శాతం వృద్థితో రూ.8,701 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,118 కోట్ల లాభాలు నమోదు చేసింది. సెప్టెంబర్‌ 2020 త్రైమాసికం లాభాలు రూ.7,475 కోట్లతో పోల్చితే గడిచిన క్యూ3లో 16.4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మార్కెట్‌ నిపుణుల అంచనాలు మించి గడిచిన క్యూ3లో ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ రెవెన్యూ 5.42 శాతం పెరిగి రూ.42,015 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్బంగా ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.