
- 'గ్యారెంటీ కార్గో'పై దొంగ దెబ్బ !
- తమిళనాడు విద్యుత్ బోర్డు నుంచి గంగవరానికి మళ్లింపు
- ఏడాదిలో రూ.70 కోట్లు చిల్లు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ప్రజల సంపదను కొల్లగొట్టే, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని దెబ్బకొట్టే దిశగా అదానీ గ్రూపు కేంద్రంలోని బిజెపితో అడ్డగోలు లాబీయింగ్‌కు పాల్పడుతోంది. గతంలో విశాఖ ఓడరేవులో బెర్తు తీసుకుని సంవత్సరాల తరబడి దాన్ని ఖాళీగా ఉంచేసి కార్గో వ్యాపారం చేయకుండా పోర్టు ఆదాయానికి రూ.వందల కోట్లు నష్టం తెచ్చిన ఈ గ్రూపును వైజాగ్ పోర్టు అధికారులు టెండర్లకు అనర్హునిగా ప్రకటించిన విషయం విదితమే. అదానీ గ్రూపు విశాఖ పోర్టుకు ఇతర రాష్ట్రాలతోగల 'గ్యారెంటీ కార్గో'ను దెబ్బతీసే చర్యలకు దిగింది. 40 ఏళ్లుగా విశాఖ పోర్టుకు తమిళనాడు విద్యుత్ బోర్డు నుంచి వెళ్తోన్న థర్మల్ కోల్ కార్గోను కేంద్రంతో అడ్డగోలు లాబీయింగ్ జరిపిఆర్డర్ మళ్లించి తన సొంత పోర్టు గంగవరానికి చేర్చుకున్నాడు. దీంతో, 2.5 మిలియన్ టన్నుల థర్మల్ కోల్ గంగవరం పోర్టుకు మళ్లిపోయింది. అదానీ ఇంకా పోర్టులో అడుగుపెట్టలేడనుకుని ఏమరుపాటుగా ఉన్న వైజాగ్ పోర్టు అధికారులకు ఇదొక రకంగా దొంగ దెబ్బే. ఇప్పటికి పోర్టు అధికారులు తేరుకుని హుటాహుటిన చెన్నరు బయల్దేరి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ఏటా ఆరు మిలియన్ టన్నుల కోల్ ఆస్ట్రేలియా నుంచి వైజాగ్ పోర్టుకు వచ్చేది. దాన్నీ అదానీ గంగవరం పోర్టు తన్నుకుపోయిన విషయం తెలిసిందే.
అదానీ వెనక ప్రధాని !
సుమారు 40 సంవత్సరాల నుంచి విశాఖ పోర్టును తమిళనాడు విద్యుత్ బోర్డు వ్యాపార భాగస్వామిగా చేసుకుని 'గ్యారెంటీ కార్గో'కు సహకారం అందిస్తోంది. ఒడిశా రాష్ట్రంలోని ఐబి వ్యాలీ నుంచి విశాఖకు రైలు మార్గంలో ఏటా 2.5 మిలియన్ టన్నుల థర్మల్ కార్గో వస్తోంది. దీన్ని కోల్ ఫీల్డ్సు వారు తమిళనాడుకు సేల్ చేస్తారు. రైలు ర్యాకులలో ఇది అన్‌లోడు అవ్వడం ఆనవాయితీ. ఆ తర్వాత విశాఖ పోర్టు ద్వారా చెన్నరు, ట్యుటికోరన్‌కు ఈ థర్మల్ కోల్ వెళ్తుంది. ఎన్నూరులో అన్‌లోడింగ్ చేస్తారు. రైలు మార్గంలో వచ్చే ఈ సరుకును విశాఖ పోర్టు సిబ్బంది అన్‌లోడింగ్ చేసి పోర్టు స్టాక్ యార్డుల్లో ఉంచి షిప్పుల్లోకి తరలించినందుకు ఆదాయం లభించేది. ఇది విశాఖ పోర్టుకు వచ్చే గ్యారెంటీ కార్గో. తద్వారా ఏటా రూ.70 కోట్లు ఆదాయం లభించేది. 2022-2023 సంవత్సరంలో తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఈ ఆర్డర్ విశాఖ పోర్టుకు రాలేదు. పోర్టు అధికారులు ఆరా తీయగా అదానీ అడ్డంపడి గంగవరం పోర్టుకు మళ్లించుకున్న విషయం తెలుసుకున్నారు.
ఉన్నతాధికారులేమంటున్నారంటే !
మూడు రోజుల క్రితమే పోర్టు ట్రాఫిక్ డిపార్టుమెంట్, పోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి కార్యాలయ సిబ్బంది చెన్నరుకు వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. థర్మల్ కోల్ సరుకు రవాణాకు విశాఖ పోర్టు రూ.190 వసూలు చేస్తుండగా, గంగవరం పోర్టు అంతకన్నా తక్కువకే చేస్తోందని విద్యుత్ బోర్డు అధికారులు చెప్తున్నారు.